ముంచినా.. తేల్చినా.. వారే దిక్కు!

16 Mar, 2019 13:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ఉన్న ప్రధాన అనుచరులే ఆయా పార్టీల అభ్యర్థులకు పెద్ద దిక్కువుతున్నారు. వీరి కష్టం మీదనే అన్ని పార్టీలు ఆధారపడుతున్నాయి. సాధారణ వేళల్లో ఎలా ఉన్నా ఎన్నికల తరుణంలో మాత్రం వీరి సహకారం లేనిదే అభ్యర్థులు కాలు కూడా కదపలేని పరిస్థితి. ఎన్నికల్లో తమ నాయకుడిని గెలిపిస్తే ఐదేళ్ల పాటు భరోసా ఉంటుందన్న భావనలో ఊరూర తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పుడే పట్టు సాధించాలన్న ఉద్దేశంతో చాలా మంది కార్యకర్తలు తామే పోటిలో ఉన్నట్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఓటు అడగడం మొదలు పార్టీ ప్రచారం, ఇతరత్రా కార్యకలపాల్ని పర్యవేక్షిస్తూ చక్కబెడుతున్నారు.

బుజ్జగింపులు.. చేరికలు
సొంత పార్టీలోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని ముందుగానే గ్రహించి వారిని బుజ్జగించటం లేదా నాయకుడి దగ్గరకు తీసుకెళ్లడంలో మండలస్థాయి నాయకులదే పాత్ర కీలకం. స్థాయిని బట్టి అభ్యర్థులే వారి ఇంటికి పోయి వారిని బుజ్జగిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తులను పసిగట్టి వారిని సొంత పార్టీలోకి లాక్కుంటున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించటానికి తమకున్న అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. అవసరాన్ని బట్టి కాలు దూస్తుండటం, తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహ హస్తాన్ని అందించడంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. మండల స్థాయిలోనే ఎంతలేదన్నా ఒక్కో పార్టీకి 40 నుంచి 50 మంది వరకు ముఖ్య నాయకులుంటారు. వీరందరిని కలుపుకుపోతే గెలుపు పక్కా కావటంతో అభ్యర్థులందరూ వీరికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

వారి సూచనలతోనే..
ప్రచారంలో భాగంగా ఓటర్ల వద్దకు వెళ్లే నాయకులు ముందు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకుల సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి వంటి వాటిని చర్చించుకుంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్న సందర్భాల్ని ఎలా డీల్‌ చేయాలో ముందస్తు వ్యూహరచన అమలు చేయటంలో వీరే కీలకం. అభ్యర్థులను పీడుస్తున్న భయం నాయకుల కోవర్టు ఆపరేషన్లు. తన వెంటే ఉంటూ ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు పార్టీ బలాలు, బలహీనతలను చేరవేసి ప్రత్యర్థులకు సాయం చేయటం. కీలక సమయంలో సహాయనిరాకరణ చేసి అభ్యర్థిని ఓడించాలన్నా సదరు ద్వితీయ శ్రేణి నాయకుల చేతిలోనే ఉంది.   

మరిన్ని వార్తలు