నిబంధనలు గాలికి..

19 Jun, 2017 10:24 IST|Sakshi
నిబంధనలు గాలికి..

► ఎమ్మార్పీ కంటే అధికరేట్లకు పుస్తకాల విక్రయాలు
► కార్పొరేట్‌ స్కూళ్లలో ఇదీ తీరు
► పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

 

పాఠశాలలు  పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఆలయాలు. ప్రసుతం అవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు వాటి అర్థం మారుస్తున్నాయి. ఒక్కో తరగతికి ఒక్కో ధర నిర్ణయించి ఎమ్మార్పీ  కంటే అధిక రేట్లతో పుస్తకాలను పాఠశాలల్లోనే విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి. టెక్నో, ఈటెక్నో, ఒలింపియాడ్‌ పేర్లతో మెటీరియల్‌ తయారు చేసినట్లు  చెబుతూ  వేలకు వేలు  ఫీజులు గుంజుతున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు వాపోతున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రచార ఆర్భాటాలతో  ప్రైవేటు సంస్థలు విద్యార్థులను ఆకర్షిస్తాయి. వీరిని పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేవలం బోధన ఫీజు మాత్రమే అని చెబుతారు.  తర్వాత  అసలు కథ మొదలవుతుంది. అడ్మిషన్‌ ఫీజు చెల్లించాక మిగిలిన రసుంల గురించి వివరించటంతోపాటు పాఠ్యపుస్తకాలు కిట్‌ పాఠశాలలోనే కొనుగొలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు.చేసేదేంలేక అడిగినంత చెల్లించాల్సి వస్తోందని  వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకూడదు. అయితే వీటిని పట్టించుకోకుండా  విద్యార్థుల తల్లితండ్రులను దోచుకుంటున్నారు.

దడపుట్టిస్తున్న ధరలు:
పుస్తకాల ధరలు ఒక్కో పాఠశాలకు ఓ రేటు  నిర్ణయించారు. కొన్ని పాఠశాలల్లో నర్సరీ పుస్తకాల కిట్‌ రూ.15 వందల నుంచి రూ.3 వేలు. యూకేజీకి రూ. 3200, ఎల్‌కేజీకి రూ. 3500.  ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు రూ. 4 వేల నుంచి  రూ. 6500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్‌ తదితర పేర్లు పెట్టి  మరో వెయ్యి  నుంచి రెండు వేల వరకు వసూళ్లు చేస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ:
నిబంధనలకు విరుద్ధంగా చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు  పుస్తకాలు విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యççపుస్తకాలు తక్కువ ధరలకు ఇస్తున్నా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో మాత్రం వేలకువేలు గుంజుతూ విద్యార్థుల తల్లితండ్రుల జేబులకు చిల్లులు వేస్తున్నారు.   ఇçప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

పరిశీలిస్తాం:
కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల్లో  పుస్తకాల విక్రయం గురించి కడప డిప్యూటీ డీఈఓ జిలానీబాషాతో మాట్లాడగా సంబంధిత సమస్య మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.   

మరిన్ని వార్తలు