ఎలాగైనా పంపాలని..

25 Nov, 2014 02:04 IST|Sakshi
ఎలాగైనా పంపాలని..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్, కమిషనర్ చక్రధర్‌బాబుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తనకు అనుకూలమైన కమిషనర్‌ను నియమించుకునేందుకు మేయర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేయర్‌కు ఆయనకు మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అవి కాస్త పెద్దవయ్యాయి.

చివరకు మున్సిపల్‌శాఖ ద్వారానే కమిషనర్ చక్రధర్‌బాబును నెల్లూరు నుంచి పంపించేందుకు ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు మేయర్ అబ్దుల్ అజీజ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ స్థానంలో గతంలో పనిచేసిన జాన్‌శ్యాంసన్‌ను తిరిగి నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ చక్రధర్ మేయర్‌ను పట్టించుకోకుండా పాలనపై దృష్టిసారించారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.

హెల్త్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయడం, విధినిర్వహణలో అలసత్వం వహించిన వారిపై కఠినంగా వ్యహరించడం లాటివి చేశారు. వారందరూ మేయర్‌కు మొరపెట్టుకున్నారు. అయితే మేయర్ సూచనలను కమిషనర్ పట్టించుకోలేదు. దీనికి తోడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను తనకు తెలియకుండానే ఖరారు చేయడం మేయర్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది.

కనీసం కమిషనర్‌ను తన కన్నుసన్నల్లో ఉంచుకొని అనుకున్న పనులను చేసుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మేయర్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చక్రధర్‌ను తప్పించాలనే ఉద్దేశంతో నేరుగా మున్సిపల్‌శాఖ ద్వారానే ప్రతిపాదనలు తెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ మున్సిపల్‌శాఖ కార్యాలయానికి ప్రతిపాదనల నివేదికను చేర్చినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు