వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అవసరం

17 Dec, 2013 01:15 IST|Sakshi

మార్కొండపాడు (చాగల్లు), న్యూస్‌లైన్: రైతులు వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడాలంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత ఎరువుల తయారీ సమాఖ్య సభ్యుడు సుంకవల్లి వెంకన్న చౌదరి డిమాండ్ చేశారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం విశేషాలను సోమవారం మార్కొండపాడులో విలేకరులకు తెలిపారు. పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రానున్న రోజుల్లో రైతులు వ్యవసాయానికి దూరం కావడం వల్ల పెరుగుతున్న జనాభాకు తిండిగింజలు కరువై ఆహార సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తేనే సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారని సూచించామన్నారు. సేంద్రీయ ఎరువులను వాడేలా రైతులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరినట్టు చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, అఖిల భారత ఎరువుల తయారీ సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌జీ రాజన్ పాల్గొన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు