సాయం చేసి ప్రాణం కాపాడండి

9 Dec, 2014 03:58 IST|Sakshi
సాయం చేసి ప్రాణం కాపాడండి

చిన్న కుటుంబానికి పెద్ద కష్టం
రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌తో జీవనం
ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు

కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. అనారోగ్యం కన్నెర్ర చేసింది. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌తో జీవితాన్ని నెట్టుకొస్తోంది. ముగ్గురు చిన్న పిల్లలతో అవస్థ పడుతోంది. ఆమె పరిస్థితి గురించి ఎవరు విన్నా కంటతడిపెట్టుకోకమానరు. ఆర్థిక సాయం చేసి ప్రాణభిక్ష పెట్టాలని ఆమె దాతలను వేడుకుంటోంది.
 
నెల్లూరు(రెవెన్యూ):  బుజబుజనెల్లూరుకు చెందిన షేక్ సాజిద్, షేక్ రమీజాబేగంలు దంపతులు. రమీజాకు మొదటి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) జన్మించారు. సాజిద్ కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల కిందట రమీజాబేగాన్ని డెలివరీ కోసం నెల్లూలోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. సిజేరియన్ చేశారు.
 
ఆడపిల్ల పుట్టింది. సిజేరియన్ తరువాత రెండు కిడ్నీలు పని చేయకుండాపోయాయి. మెరుగైన వైద్యం కోసం ఉన్న ఇంటిని విక్రయించి చెన్నైలో చేర్పించారు. ఏడాది పాటు వైద్యం చేయించినా ఫలితం లేదు. కిడ్నీలు మార్చాలని వైద్యులు తేల్చి చెప్పారు. రూ.28 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం డయాలసిస్‌పై ఆమె జీవనం సాగిస్తోంది. ప్రతి నెలా రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. ఆరోగ్యశ్రీ సేవలు కుడా ఆదుకోలేదు.

చేసేదేమీలేక సాయం కోసం సోమవారం కలెక్టర్ ఎం.జానకిని కలసి తమ గోడును విన్నవించుకుంది. ముగ్గురు చిన్న పిల్లలతో వచ్చిన రమీజాబేగం కలెక్టర్ ఎదుట తన బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది. ప్రతి నెలా ఇంటి అద్దె చెల్లించలేక, డయాలసిస్ చేయించు కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని బాధితురాలు వాపోయింది. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సాయం చేయదలచినదాతలు 7799350915కు ఫోన్ చేయొచ్చు.

మరిన్ని వార్తలు