పీఠాధిపతి అరెస్ట్‌.. శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత

16 Jul, 2018 18:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీప‌తి శివ‌స్వామి తీవ్ర ఆరోపణల చేశారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినందుకు హౌస్‌ అరెస్ట్‌ చేశామని పోలీసులు చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శివస్వామి హౌస్‌ అరెస్ట్‌ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హిందుత్వంపై జరుగుతున్న దాడులను క్షేత్రానికి చెందిన పలువురు ఖండించారు.

శ్రీవారి ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ వేసి విచారణ చేయకుంటే ఆరోపణల్లో నిజముందని భావించాల్సి ఉంటుందన్నారు. హిందుత్వంపై టీడీపీ సర్కార్‌ చేస్తున్న దాడులను నిరసిస్తూ చలో తిరుపతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆగస్టు 12కు తిరుమల చేరుకుంటుందని వెల్లడించారు. 30 మంది స్వామిజీలు, 200 మంది శిష్యులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని.. ఇందులో భాగంగా 500 గ్రామాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. హిందుత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలకు వివరించి, ఏం జరిగినా సరే ఆగస్టు 13న తిరుపతి బంద్‌ నిర్వహిస్తామని శివస్వామి వివరించారు.

మరిన్ని వార్తలు