కేశవ్‌.. నీటి రాజకీయాలు మానుకో...

24 Nov, 2018 12:51 IST|Sakshi
నింబగల్లు జీరోబైజీరో కెనాల్‌ వద్ద ఇరిగేషన్‌ ఇంజినీర్లతో మాట్లాడుతున్న శివరాంరెడ్డి, ప్రణయ్‌కుమార్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్సీ చీఫ్‌విప్‌ వై.శివరాంరెడ్డి

గడువు వరకు జీబీసీ కెనాల్‌ 300 క్యూసెక్కులను నీటిని పూర్తిగా ఇవ్వాలి

గడువు దాటిన తర్వాత 20 రోజులు అదనంగా 150 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలి

అనంతపురం, ఉరవకొండ రూరల్‌: ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ నీటి రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చీఫ్‌విప్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వై.శివరాంరెడ్డి హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి చెరువులకు, కుంటలకు నీళ్లిచ్చి రైతులను మభ్యపెట్టడం కాకుండా చేతనైతే జీబీసీ, హెచ్‌ఎల్సీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇప్పించాలన్నారు. మండల పరిధిలోని జీరోబైజీరో హెడ్‌ వద్ద జీబీసీ కెనాల్‌ను శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్‌కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. కెనాల్‌లో నీటిప్రవాహం తగ్గడం వల్ల వ్యవసాయానికి వచ్చే 300 క్యూసెక్కుల నీటివాటాను సక్రమంగా ఇవ్వకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేదన్నారు. మిరప, పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చేసి జీబీసీ షట్టర్లను ఎత్తి ఎక్కువ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం వారు విడపనకల్, ఉరవకొండకు సంబంధించిన ఆయకట్టు రైతుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శివరాంరెడ్డి మాట్లాడుతూ ముందే ఉరవకొండ, విడపనకల్‌ మండలాలకు సంబంధించిన చివరి ఆయకట్టు భూములకు నీటిని తప్పనిసరిగా విడుదల చేయాలన్నారు.

డిసెంబర్‌ 15వ తేదీ తర్వాత నీటి విడుదలను నిలిపేస్తే పంటలు ఎండిపోయే పరిస్తితి ఉన్నందున ఆ తర్వాత కూడా కనీసం 20 రోజులు అదనంగా నీరు విడుదల చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. నాలుగేళ్ల నుంచి చెరువులకు నీరివ్వని పాలకులు నాలుగైదు నెలల్లో ఎన్నికలున్నందున దొంగ ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేశవ్‌ దొంగ ప్రచారాలు మాని ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉరవకొండలో పేదల ఇళ్లపట్టాల కోసం 88 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే వాటిని ఇంతవరకు పేదలకు పంచకుండా రాజకీయంగా అడ్డుపడుగున్నారని విమర్శించారు. ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు రాజకీయాలు మాని ప్రజలకు సేవచేయాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, దాదు, బసవరాజు, నిరంజన్, ఓబన్న, గోవిందు, వెంకటేశులు, అనుమప్ప, హఫీజ్, ఈడిగప్రసాద్, సత్యన్న, ఓబుళేసు, ఎర్రిస్వామి, రఘు, యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సురేష్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు