చిక్కుల్లో సిక్కోలువాసులు

27 Mar, 2020 13:22 IST|Sakshi
చిత్తూరు సరిహద్దు ప్రాంతంలోని వసతి గృహంలో భోజనం చేస్తున్న జిల్లా మత్స్యకారులు

బయట ప్రాంతాల్లో చిక్కుకున్న మత్స్యకారులు

యాత్రికులదీ అదే పరిస్థితి

ఎచ్చెర్ల క్యాంపస్‌/ఎచ్చెర్ల: కరోనా వైరస్‌ సిక్కోలువాసులను చిక్కుల్లో పడేసింది. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారితో పాటు యాత్రికులను ఎక్కడికక్కడ నిర్బంధంలో చిక్కుకునేలా చేసింది. తమ సొంత గ్రామాలకు ఎలా చేరుకోవాలో తెలియక వారంతా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం, గార, శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం, కవిటి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మత్స్యకారులు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరంతా గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్, సూరత్, మహరాష్ట్రలోని పూనే, ముంబై, కర్ణాటకలోని మంగుళూరు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లారు. నెలల పాటు సముద్రంలో ఉండి చేపల వేటసాగిస్తారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పనిలేక, సొంత గ్రామాలకు చేరుకునే వీలు లేక వీరంతా సతమతమవుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో చాలామంది కర్ణాటక వెళ్లిన చాలామంది చిత్తూరు జిల్లాలో ఇరుక్కుపోయారు. స్థానిక పోలీసులు ఇటువంటి వారిని సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్‌ వెళ్లిన మత్స్యకారులదీ ఇదే పరిస్థితి. తమవారి పరిస్థితి తెలియక ఇక్కడి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా నుంచి 11 నుంచి 12 వేల మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో వలసకార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.  

చిత్తూరు సరిహద్దులో వసతి సౌకర్యం
ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం, బడివానిపేట, డి.మత్స్యలేశం పంచాయతీలకు చెందిన మత్స్యకారులకు చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో భోజన, వసతి సౌకర్యాలను అక్కడి మత్స్యశాఖ అధికారులు కల్పించారు. కర్ణాటక రాష్ట్రానికి చేపలవేటకు వెళ్లి ఇంటికి వస్తుండగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వీరంతా చిత్తూరు సరిహద్దుల్లో ఉండిపోయారు. మొత్తం 51 మంది మత్స్యకారులు చిక్కుకున్న విషయాన్ని స్థానిక మత్స్యకార నాయకులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు తెలియజేశారు. కలెక్టర్‌ స్పందించి చిత్తూరు జిల్లా అధికారులతో మాట్లాడి అక్కడి బీసీ వసతిగృహంలో వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు.  

విజయవాడలో వలస కూలీల పాట్లు
నరసన్నపేట రూరల్‌ : మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసం విజయవాడ వెళ్లారు. కరోనా వైరస్‌ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, అక్కడ పనులు లేక తినటానికి తిండిలేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు లేక పస్తులుంటున్నారు. గ్రామానికి చెందిన బూర్లె రాంబాబు, సవలాపురం శారద, సవలాపురం వాసు, కంకనాల లక్ష్మి, కంకనాల కృష్ణ, గొంటి ఇల్లయ్య, బుక్క రాము, బోనెల రమణమ్మ తదితరులు విజయవాడలో చిక్కుకున్నారు. తమను గ్రామానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.      

కాశీలో చిక్కుకున్న 38 మంది భక్తులు
అరసవల్లి: తీర్థయాత్రల్లో భాగంగా ఈ నెల మొదటి వారం ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలకు వెళ్లిన అరసవల్లి, సింగుపురం, ధర్మవరం తదితర ప్రాంతాలకు చెందిన 38 మంది భక్తులు కరోనా ప్రభావంతో అక్కడే చిక్కుకున్నారు. కాశీలోని  ఓ గదిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. ఇక్కడికి వచ్చేందుకు ఏమాత్రం రవాణా సౌకర్యాలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లి తదితర ప్రాంతాల్లోని వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు