విశాఖ తీరంలో ఆరుగురు గల్లంతు

11 Nov, 2018 18:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సముద్రంలో స్నానానికి దిగి కొట్టుకుపోయిన యువకులు

మరో యువకుడిని రక్షించిన సెక్యూరిటీ గార్డు

గల్లంతైన వారంతా విశాఖవాసులే   

గాజువాక/మల్కాపురం: విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో స్నానానికి దిగిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. న్యూపోర్టు పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరంలోని సీతమ్మధార దరి హెచ్‌బీ కాలనీ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులు ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో యారాడ బీచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం భోజనం ముగించుకొన్న అనంతరం 2.30 గంటల సమయంలో వారిలో పది మంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే ఆ సమయంలో వచ్చిన ఓ రాకాసి అల ఏడుగురిని లోపలికి లాక్కెళ్తుండగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఓ యువకుడిని బయటకు లాగి రక్షించాడు. మిగిలిన వారిలో హెచ్‌బీ కాలనీ దర్గానగర్‌కు చెందిన దేవర వాసు (21), పేరిడి తిరుపతి (21), చాకలిపేట భానునగర్‌కు చెందిన కోన శ్రీనివాస్‌ (21), నక్క గణేష్‌ (17), దుర్గా (21), కేఆర్‌ఎం కాలనీకి చెందిన రాజేష్‌ (21) గల్లంతైనట్టు పోలీసులు తెలిపారు.

 సమాచారం తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ నుంచి కోస్టుగార్డు సహాయాన్ని కూడా కోరినట్టు న్యూపోర్టు సీఐ సోమశేఖర్‌ తెలిపారు. మల్కాపురం సీఐ కేశవరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. గల్లంతైనవారిలో దేవర వాసు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేరిడి తిరుపతి ఐటీఐ చదువుతున్నాడు. కోన శ్రీనివాస్, నక్కా గణేష్, దుర్గా ఒక ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ షాప్‌లో, రాజేష్‌ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గల్లంతైనవారి ఆచూకీ అర్ధరాత్రి సమయానికి కూడా తెలియరాలేదు. వారికోసం పోలీసులు, యారాడకు చెందిన గజ ఈతగాళ్లు విరామం లేకుండా గాలిస్తున్నారు. నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆయన అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.   

అలల తాకిడే ప్రమాదానికి కారణం 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలలు ఉవ్వెత్తున వస్తాయని, ఆ సమయంలో ఎవరైనా స్నానాలకు వెళ్తే ప్రమాదాలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. యారాడ సముద్ర తీరానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గత మూడేళ్లలో ఇక్కడ సుమారు 30 మంది మృతిచెందారు.

మరిన్ని వార్తలు