స్వయం పోషకంగా స్మార్ట్ నగరాలు

13 Dec, 2015 05:13 IST|Sakshi
స్వయం పోషకంగా స్మార్ట్ నగరాలు

అధికారులు ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

 సాక్షి, విజయవాడ బ్యూరో: జాతీయస్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి గాను తిరుపతి, కాకినాడ, విశాఖలు స్థిరంగా, స్వయంపోషకంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల్ని రాబట్టేలా, పెద్దఎత్తున యాత్రికులను ఆకర్షించేలా ప్రణాళికలుండాలన్నారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత స్మార్ట్ నగరాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి రాష్ట్రం నుంచి ఈ మూడు నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మూడు నగరాల నవీకరణపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనివాసమ్ వరకూ 1.6 కిలోమీటర్ల మేర ఆకాశమార్గాన్ని నిర్మించేలా అధికారులిచ్చిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్లాన్‌పై ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులు సూచించారు. మొత్తం నగర నవీకరణకు రూ.2,636 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.  విశాఖ స్మార్ట్ నగరం రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్  ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆటో రిక్షాల నుంచి ఇ-రిక్షా స్థాయికి ఎదిగేలా ప్రజారవాణా వ్యవస్థను ప్రణాళికలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

అందమైన సాగరతీరం, చుట్టూ పర్వత శిఖరాలే విశాఖ నగరానికి వన్నె తెస్తున్నాయని కైలాసగిరి, మధురవాడ, కంభాలకొండ ప్రాంతాలను ఆకర్షణీయ ప్రాంతాలుగా మలిచి విశాఖను ప్రపంచ పర్యాటక గమ్య స్థానాల్లో ఒకటిగా మార్చాలని సీఎం కోరారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు