గ్యాంబ్లింగ్‌ ఉచ్చులో యువత..!

16 Sep, 2019 10:55 IST|Sakshi

జిల్లాలో జోరందుకున్నమొబైల్‌ బెట్టింగులు

స్మార్ట్‌ఫోన్‌లతో వందలాది గ్యాంబ్లింగ్‌ గేమ్‌లు

రహస్యప్రదేశాల్లో యథేచ్ఛగా సాగుతున్న పందేలు

నిమిషాల్లో చేతులు మారుతున్న డబ్బులు

ఈ ఊబిలో కళాశాలకు వెళ్లే విద్యార్థులే అధికం

పలమనేరు పట్టణంలోని బజారువీధికి చెందిన ఇంటర్‌ చదివే యువకుడు కళాశాలలో ఫీజు కట్టాలని తండ్రి వద్ద రూ.పదివేలు తీసుకుని మొబైల్‌ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. వారం రోజుల పాటు ఇల్లు వదిలి పారిపోయాడు. కన్నబిడ్డపై మమకారంతో తల్లిదండ్రులు కొడుకును వెతికి పట్టుకున్నారు. బైరెడ్డిపల్లి మండలానికి చెందిన మరో విదార్థి తండ్రి ఏటీఎం కార్డుతో రూ.6వేలు డ్రాచేసి మొబైల్‌ గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని ఇంట్లో దెబ్బలు తిన్నాడు.. ఇలా విద్యార్థులు, యువత  బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

చిత్తూరు, పలమనేరు : మునుపటిలాగా పేక ముక్కలతో  పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. ప్రస్తుత సాంకేతికత పుణ్యమా అని కేవలం ఓ స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు క్యాండీక్రష్‌ సాగా లాంటి గేమ్స్‌ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్‌ గేమ్‌లపై పడింది. ప్రస్తుతం జిల్లాలో ఎటుచూసినా యువత నోట ఎంజీ మాటే.  ముఖ్యంగా ఈ జూదానికి బానిసైన వారిలో కళాశాలలకు వెళ్లే విద్యార్థులుండడం బాధాకరం. గత కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. కానీ నేడు మండల కేంద్రాలకూ ఇది వ్యాపించింది. పది రూపాయల నుంచి నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోంది.

పలు రకాల గ్యాంబ్లింగ్‌లు..
గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగేది. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. ఇవి కాకుండా ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్న కొత్త మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్‌ కాషినోస్, ప్లేకార్డ్‌ ఎక్స్‌ప్రెస్, రమ్మీ, రియల్‌ మనీ క్యాషినో, ఫాస్ట్‌ బెట్టింగ్, ఈజీ టు ఎర్న్, క్యాండీక్రష్‌ బెట్టింగ్‌.. ఇలా రకరకాల బెట్టింగ్‌లు ఉన్నాయి. ఇక ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే గ్యాంబ్లింగ్‌ యాప్‌లు వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్‌టైమ్, రాలెట్‌ రాయల్, బ్లాక్‌జాక్, స్లాట్‌ మిషీన్, లక్కీ డే, స్పిన్‌టు విన్, హార్స్‌ బెట్టింగ్, సూపర్‌ స్నేక్, జాక్‌పాట్‌ రాజా, టీన్‌పతి గోల్డ్, బింగో లాంటి గేమ్స్‌లో నిమిషాల్లో బెట్టింగ్‌ జరుగుతోంది.

నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే..
మామూలుగా క్రికెట్‌ ఆడుకోవడానికి వెళ్లే యూత్‌ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లలో చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కనుక వీటిని ఎక్కువగా ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు ధారబోస్తున్నారు. వీరు ధరించిన బంగారు ఆభరణాలు, మొబైల్‌ఫోన్‌లు, బైక్‌లు సైతం బెట్టింగ్‌లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతో పాటు బంగారు  భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.

పోలీసులు కనుక్కోలేరు..
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరులలో యూత్‌ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్‌ ఆడుతున్నామనో, స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కనుక పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన కుమారులను ఎలా దారినపెట్టాలో అర్థం గాని తల్లిదండ్రులెందరో ఉన్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

మరిన్ని వార్తలు