తగ్గని పాముకాటు కేసులు

20 Aug, 2018 13:08 IST|Sakshi
చికిత్స పొందుతున్న మణికంఠ

 ఆదివారం ఏడుగురికి పాము కాటు

రెండురోజుల వ్యవధిలో 30 కేసులు నమోదు

అవనిగడ్డ: అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఆదివారం మొత్తం ఏడు పాము కాటు కేసులు నమోదయ్యాయి. వీటిలో కోడూరు మండలం హరిపురంకు చెందిన ఆరేపల్లి మణికంఠ అనే పన్నెండేళ్ల విద్యార్థి ఉదయం పశువుల మేత వేసేందుకు గడివాము దగ్గరకు వెళ్లి వరి గడ్డి లాగుతుండగా పాము కరిచింది. ప్రస్తుతం మణికంఠ అవనిగడ్డ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఆరుగురు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఎవరి పరిస్థితి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. యాంటీ స్నేక్‌ మందు వైద్యశాలలో అందుబాటులో ఉందని, అందరికీ వైద్యం సరైన సమయంలో ఇస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణదొర చెప్పారు. శనివారం ఒక్క రోజే ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో 21 పాముకాటు కేసులు నమోదైన విషయం విధితమే. దివిసీమలో రోజురోజుకు పాము కాటు కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పాముకాట్లపై స్పందించిన మంత్రి
ప్రస్తుతం దివిసీమలో అత్యధికంగా నమోదవుతున్న పాముకాటు కేసులపై వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి ఆదివారం స్పందించారు. తిరుపతిలో జరిగిన సమావేశం కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో పాములు సంచారం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. పాముకాటుకు గురై అవనిగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారెవరికి ప్రాణాపాయం లేదని, అందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ఆస్పత్రుల్లో మందు కొరత లేదని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

పాముకాటుతో మహిళ మృతి
తునికిపాడు(గంపలగూడెం): పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని తునికిపాడులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్లబోతుల విజయ(40) పత్తి చేలో పని చేస్తుండగా పాముకాటుకు గురైంది. బాధితురాలిని తెలంగాణ రాష్ట్రం మధిర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మృతి చెందింది. విజయ భర్త కృష్ణ 8 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మృతురాలికి ఇద్దరు సంతానం. కుమారుడికి వివాహం అయింది. కుమార్తె డిగ్రీ చదువుతోంది. మృతదేహాన్ని వైఎస్సార్‌ సీపీ మండల అ«ధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చిన్నపిచ్చియ్యలు సందర్శించి తమ సంతాపాన్ని, మృతురాలి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు