స్నే‘కింగ్‌’ ఆనంద్‌

25 Jul, 2019 13:21 IST|Sakshi
సర్పంతో ఆనంద్‌

సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఈ స్నేకింగ్‌ ఆనంద్‌.. అందరూ భయపడే పాములను ఎందుకు పడుతున్నాడు.. ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 
అది 1999 నవంబరో.. డిసెంబరో సరిగా గుర్తు లేదు.. నేను నిర్వహించే టిఫిన్‌ సెంటర్‌లో ఎనిమిది అడుగుల కొండ చిలువ చొరబడింది. దీనిని పట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. కొండ చిలువ కరిస్తే ప్రాణహాని ఉండదని ఎవరో చెబితే తెలిసింది. నాకు నేనే హీరో అవతారమెత్తి సుమారు అరగంట సేపు కొండ చిలువను బంధించే సాహసం చేశా..అదే సమయంలో నా చేయిని గట్టిగా చుట్టేసింది. అయినా ధైర్యంతో పోరాడా.. చివరికి అది ఓడిపోయింది. నేనే గెలిచా... దీనిని అందరూ ఆసక్తిగా తిలకించారే తప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఇలాగే మరో సంఘటన 1997 ఆగస్టులో జరిగింది. సింథియా న్యూ కాలనీ చెందిన 13 ఏళ్ల దిలీప్‌ అనే విద్యార్థి స్కూల్‌ వస్తూ ఓ చెట్టు వద్ద స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అక్కడే నక్కి ఉన్న కొండచిలువ దిలీప్‌ను చుట్టేసింది. అటువైపు వచ్చిన వారంతా చూస్తున్నారే తప్ప విద్యార్థిని కాపాడేందుకు సాహసించలేకపోతున్నారు. ఎవరో ఈ విషయం చెబితే అక్కడకు వెళ్లా...కొండచిలువతో పోరాడి దిలీప్‌ను కాపాడా.. దీంతో ఆ రోజు నుంచి కాలనీలో నా పేరు మార్మోగిపోయింది. ఇలా అందరూ అభినందిస్తుంటే ఆ కిక్‌ మాటల్లో చెప్పలేను.

పేరు  :   పడాల ఆనంద్‌
నివాసం :  సింథియా (న్యూకాలనీ)
వృత్తి    :    టిఫిన్‌ సెంటర్‌
ప్రవృత్తి   :   పాములు పట్టడం
సెల్‌ నంబర్‌ : 9849023327, 9705395737

ఆ కిక్కే వేరు...
అందరూ విష సర్పాలను చూసి భయపడుతున్నారు.. ఆ విషసర్పాలకు నేనంటే భయం ఏర్పడాలి అనుకున్నా.. అంతే అప్పటి నుంచి పాములు పట్టడంలో నాకు నేనే శిక్షణ ఇచ్చుకున్నా.. ఇదే వృత్తిలో ఉండిపోయా.. నగర పరిధి, షిప్‌యార్డ్,హెచ్‌పీసీఎల్, నేవల్‌ ఏరియా తదితర ప్రాంతాలలో ఎక్కడ పాములు కనిపించినా అందరూ నన్నే పిలుస్తారు. తక్షణం అక్కడ వెళ్లి ఎంత పెద్ద విషసర్పమైనా బంధించి సమీప కొండ ప్రాంతంలో విడిచి పెడుతుంటా.

విశాఖలో సంచరించే పాములు ఇవే..
విశాఖ పరిధిలో ఎక్కువగా నాగుపాము, కట్లపాము, పొడపాము, గ్రీన్‌స్నేక్‌ వంటి విషసర్పాలతో పాటు కొండచిలువలు సంచరిస్తాయి. కొండచిలువ, పొడపాము రెండుచూడటానికి ఒకే మాదిరగా ఉంటాయి. వాటి శరీరంపై ఉన్న చారలు బట్టి అది ఏ జాతో చెప్పవచ్చు. అయితే ఏ విషసర్పమైన కరిస్తే 30 నిమిషాల వ్యవధిలో వైద్యులను సంప్రదించాలి. నగరంలో ఎక్కడైన, ఎవరి ఇంట్లోనైనా సర్పం చొరబడితే  9849023327, 9705395737 నంబర్‌కు ఫోన్‌ చేయండి. తక్షణం స్పందిస్తా... అంటూ ఆనంద్‌ ముగించాడు.

పది వేల పాములు పట్టిన  ట్రాక్‌ రికార్డ్‌
ఇప్పటి వరకు సుమారు 10 వేలు వరకు వివిధ రకాల పాములను బంధించి కొండ ప్రాంతంలో విడిచిపెట్టా.. షిప్‌యార్డ్, నేవల్‌ అధికారులు ఎంతో అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. ఎన్నో అవార్డులు, జ్ఞాపికలు, నగదు సాయం అందజేశారు.

మరిన్ని వార్తలు