నేటి నుంచి సంక్రాంతి స్పెషల్‌ బస్సులు

9 Jan, 2020 13:33 IST|Sakshi
గుంటూరులోని ఎన్‌టీఆర్‌ బస్‌ స్టేషన్‌

రీజియన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు 612 ఆర్టీసీ బస్సు సర్వీసులు  

ప్రయాణికులకు ప్రత్యేక బస్సుల్లో 40 శాతం రాయితీ  

20వ తేదీ వరకు  అవకాశం ఆర్‌ఎం సుమంత్‌ ఆర్‌.ఆధోని

పట్నంబజారు(గుంటూరు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. రీజియన్‌ పరిధిలోని 13 డిపోల నుంచి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. జిల్లా నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే వారి కోసం సర్వీసులు సిద్ధం చేశారు. ప్రయాణికులు సంఖ్య అధికం కావటంతో సర్వీసుల సంఖ్య కూడా పెంచారు. 

సర్వీసులు అందుబాటులో ఇలా...  
ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది డిసెంబర్‌ 28వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ రిజర్వేషన్, బుకింగ్‌ సెంటర్‌లలో టిక్కెట్లు, సర్వీసుల వివరాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. తొలుత హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు 333 బస్సులు కేటాయించారు. కానీ ప్రయాణికుల సంఖ్య పెరగటంతో వాటిని 562 సర్వీసులకు పెంచారు. బెంగళూరు నుంచి 20, చెన్నై నుంచి 30 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తొలుత 350 సర్వీసులు నిర్ణయించిన అధికారులు వాటిని 430గా మార్చారు. బెంగళూరుకు 20, చెన్నైకి 30, వైజాగ్, తిరుపతి తదితర ప్రాంతాలకు అవసరాన్ని బట్టి సర్వీసులను అందబాటులో ఉంచనున్నారు. సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి గుంటూరు రీజియన్‌కు 612 సర్వీసులు అందుబాటులో ఉంచగా, గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు 499 సర్వీసులు తిప్పనున్నారు. 

ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ...
సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుల్లో ప్రయాణికులకు రాయితీ కల్పించనున్నారు. స్పెషల్‌ సర్వీసులకు సంబంధించి టిక్కెట్‌ ధరలు మామూలు టిక్కెట్‌ ధరలు కంటే కొద్దిపాటి మొత్తం అధికంగా ఉంటుంది. దీనికి సంబందించి పెరిగిన మొత్తంలో 40 శాతం రాయితీని ప్రయాణికులకు అందజేస్తున్నారు. తద్వారా ప్రత్యేక సర్వీసుల్లో సైతం ప్రయాణికులకు మేలు చేకూరనుందని అధికారులు తెలిపారు.

సర్వీసులు పెంచుతాం
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతాం. ఇప్పటీకే రీజియన్‌ అధికారులతో స్పష్టంగా చర్చించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు ఏర్పాటు చేశాం. రద్దీ పెరిగితే అప్పటికప్పుడే సర్వీసులు సిద్ధంగా ఉంటాయి. దీనితో పాటు ప్రయాణికులకు అందజేస్తున్న 40 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.  –సుమంత్‌ ఆర్‌ ఆధోనిఏపీఎస్‌ ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌

మరిన్ని వార్తలు