ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

26 Jul, 2018 14:34 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు  

జగన్‌ నాయకత్వంలో హోదా సాధిద్దాం..

బంద్‌లో చంద్రబాబు కుట్రలు విఫలం

బంద్‌కు సహకరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు

ప్రజా కోర్టులో మంత్రి సుజయ్‌కు శిక్ష తప్పదు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం మున్సిపాలిటీ : విభజనతో వెనుకబడిన  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం హక్కు అని, ఎవరో ఇచ్చే  భిక్ష కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర  భవిష్యత్‌ను నిర్ధేశించే హోదా కోసం ప్రాణాలకు సైతం తెగించి అలుపెరగని పోరాటం చేస్తున్న  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో  ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేరుస్తామన్నారు.  

సత్య కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న  ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు హోదా సాధనలో భాగంగా ప్రతిపక్షం చేపట్టిన ఏపీ బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు తన మోసకారి బుద్దితో ఐదు కోట్ల మంది ఆంధ్రులను  నయవంచనకు గురి చేసి ప్యాకే జీ మంజూరు చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సన్మానం చేయగా.... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అసెం బ్లీ సాక్షిగా ధన్యవాదాలు తీర్మానం చేసిన విషయాన్ని  ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరిచిపోరన్నారు.  తాజాగా రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో  ఆయన నిజస్వరూపం  బట్టబయలైందన్నారు.  

ప్రధాని  మోదీ పార్లమెంట్‌ సాక్షిగా చంద్రబాబు ఆశించిన ప్యాకేజీ నాటకాన్ని బహిర్గతం చేశారన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై మొదటి సారిగా అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రాంతీయ పార్టీగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.   

అధికార పార్టీ చేస్తే ఒప్పు... ప్రతిపక్షం చేస్తే తప్పా...?

రాష్ట్ర ప్రభుత్వం కుటిల బుద్దిని  జిల్లా ప్రజలు గమనించాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. ప్రత్యేక హోదా పేరుతో  టీడీపీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో  కలెక్టర్‌ పాల్గొనవచ్చని కానీ...  ప్రతిపక్షం ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టడం తప్పా అంటూ నిలదీశారు. ఇదేనే హోదా సాధనలో చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అంటూ ప్రశ్నించారు. హోదా కోసం పోరాడుతున్న వారిని అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి సుజయ్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు.  పార్టీ ఫిరాయించి నమ్మిన ప్రజలను వెన్నుపోటు పొడిచే మీ లాంటి ఆలోచనలు వైఎస్సార్‌ సీపీకి లేవని స్పష్టం చేశారు.  సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ జిల్లా నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కనకల రఘురామారావు, గంటా సతీష్, సంచాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా