రాతిని శిలగా మార్చి..

27 Jul, 2018 09:21 IST|Sakshi
రాతి శిల్పాన్ని చెక్కుతున్న రామ్మూర్తి ఆచారి

మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురువిశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం కొలిచే దేవుడు ఇలాగే ఉంటాడు అని నిర్ధిష్టమైనప్రమాణాలు ఏవీ లేనప్పటికీ.. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాడు రామ్మూర్తి. అతని ఉలి దెబ్బకు ఎలాంటి రాయి అయినా దేవతా రూపం దాల్చి తీరుతోంది. శిల్ప కళతో పాటు వడ్రంగి పనిలోనూ ప్రత్యేకతనుచాటుకుంటున్న రామ్మూర్తి గురించి తెలుసుకోవాలంటే చంద్రగిరి గ్రామానికివెళ్లి తీరాల్సిందే.  

బొమ్మనహాళ్‌ : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన రామ్మూర్తి ఆచారి.. రాతితో శిల్పాలు చెక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాతితో దేవతా ప్రతిమలు చేయడంలోనే కాదు చెక్కతో రథాలు, బొమ్మలు చేయడంలోనూ మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ మరి కొందరికి ఉపాధిని అందిస్తున్నారు.

చిన్నప్పటి సాధనే..
రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. ఇంటర్మీడియట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమయ్యాడు. అప్పటి వరకు చిత్రకళపై ఉన్న మక్కువను చెక్కతో బొమ్మలు తయారు చేయడంపై మళ్లించాడు. అనంతరం రాతితో విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించాడు. తొలిదశలో రాతిని శిల్పంగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ అదే పనిగా సాధన చేయడంతో తిరుగులేని నైపుణ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ముందుగా స్కెచ్‌ పెన్ను,  పెన్సిల్‌తో దేవతామూర్తుల చిత్రాలను గీసుకుని అందుకు అనుగుణంగా విగ్రహాలను ఆయన తయారు చేస్తుంటారు.

ఉభయ రాష్ట్రాల్లో పేరు
శిలా విగ్రహాల తయారీకి రామ్మూర్తి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు జిల్లా కోటప్ప కొండ నుంచి ప్రత్యేకంగా రాయిని తెప్పించుకునేవాడు. వీటితో శివుడు, పార్వతి, ఆంజనేయస్వామి, మద్దానేశ్వరస్వామి, సరస్వతీ, అయ్యప్ప, వినాయకుడు, ప్రభావతి, నాగలింగేశ్వరుడు, నంది, నవగ్రహాలు, వీరభద్రస్వామి తదితర విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటాడు. బళ్లారిలోని బసవ భవన్‌లో ఏర్పాటు చేసిన అనాది లింగేశ్వర స్వామి విగ్రహం, హిందూపురంలోని ప్రత్యంగిరాదేవి ప్రతిమ ఇతను చేసినవే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన వాల్మీకి, కనకదారు విగ్రహాలను కూడా రామ్మూర్తి చేసినవే కావడం గమనార్హం. తన వృత్తి నైపుణ్యంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పటివరకు వందకు పైగా విగ్రహాలు, రథాలను రామ్మూర్తి ఆచారి చేసి ఇచ్చారు.  

గ్రామీణ శిల్పులను ఆదుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లోని శిల్పులను ప్రభుత్వం ఆదుకోవాలి. వృత్తి నైపుణ్యతకు సహకరించాలి. శిల్పాలు చేసేందుకు ప్రత్యేక రాయితీలతో పాటు ప్రోత్సాహాకాలు అందించాలి. దేవతా విగ్రహాలను తయారు చేయడం ద్వారా రోజూ రూ. 400 ఆదాయం వస్తోంది. దీంతోనే జీవనం సాగించడం దుర్భరంగా ఉంటోంది.– బడిగే రామ్మూర్తి ఆచారి, శిల్పి, చంద్రగిరి

మరిన్ని వార్తలు