తండ్రిని బతికించమంటూ తనువు చాలించాడు

27 Jul, 2018 09:17 IST|Sakshi

పురుగు మందు తాగి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

పార్టీ నాయకులు తమ కుటుంబాన్ని ఆదుకోలేదని ఆవేదన

ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ బలవన్మరణం

తన మృతితోనైనా తండ్రిని బతికించాలంటూ వేడుకోలు  

సాక్షి, చిలకలూరిపేట టౌన్‌: పక్షవాతంతో మంచం పట్టిన తన తండ్రిని అధికారపార్టీ నాయకులు పట్టించుకోవట్లేదని మనస్తాపం చెందిన టీడీపీ యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి..

చిలకలూరిపేటలోని తూర్పు దళితవాడకు చెందిన టీడీపీ నాయకుడు యడ్ల దాసు అలియాస్‌ జింగిరి రెండేళ్లక్రితం పక్షవాతంతో మంచం పట్టాడు. అప్పట్నుంచీ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు మేరిబాబు, విజయ్‌ కుమారులు. ఎంటెక్‌ చేసిన మేరిబాటు స్థానిక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. దాసు భార్య ఎస్తేరు రోజువారీ కూలీ పనులకు వెళుతోంది. వీరిద్దరూ సంపాదించిన డబ్బులు దాసు వైద్యఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు విజయ్‌ ఇంటర్‌ పూర్తవగానే టవర్‌ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భర్త వైద్య చికిత్సకయ్యే ఖర్చు తడిసిమోపెడవడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎస్తేరు స్థానిక టీడీపీ నాయకులను కలసి.. చికిత్సకయ్యే ఖర్చును మంత్రి ద్వారా ఇప్పించేలా చూడాలని ఎన్నోసార్లు వేడుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇదుగో అదుగో అంటూ టీడీపీ నాయకులు కాలయాపన చేశారు తప్ప పట్టించుకోలేదు.

పార్టీ వైపు నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో తండ్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడం, కుటుంబమంతా కష్టపడినా వైద్యఖర్చులకు కూడా సరిపోకపోవడంతో విజయ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం చీరాలలోని రామాపురం బీచ్‌కు పురుగు మందు డబ్బా తీసుకెళ్లిన విజయ్‌ అక్కడే ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేసి టీడీపీ తమకు ఏ సహాయం చేయలేదని, అయినవాళ్లే అంతా అన్యాయం చేశారని, ప్రభుత్వం ఏర్పడినా ఉద్యోగాలు రావని ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పురుగుమందు తాగాడు. తన మరణంతోనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి.. మంచంలో ఉన్న తన తండ్రిని బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. పురుగు మందు తాగి పడిపోయిన విజయ్‌ని గమనించిన స్థానికులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. 

మరిన్ని వార్తలు