వాహనాలు జరభద్రం!

18 May, 2018 13:16 IST|Sakshi
ఎండలో పార్కింగ్‌ చేసిన వాహనాలు

గుంటూరు: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. సాయంత్రం ఆరు గంటల వరకు చల్లదనం మాటే వినిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు మన వాహనాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. లేనిపక్షంలో ఎండ తీవ్రతకు అవి దెబ్బతిన మన జేబులను ఖాళీ చేయిస్తాయి. ఈ నేపథ్యంలో కొద్దిపాటి జాగ్రత్తలతో వాహనాలను ఎలా సంరక్షించుకోవాలో చూద్దాం రండి..

ద్విచక్ర వాహనాల విషయంలో ఇలా...
ద్విచక్ర వాహనాలను ఎక్కువ సేపు ఎండలో ఉంచకూడదు.
అలా ఉంచడం వల్ల ట్యాంకులోని పెట్రోలు ఆవిరైపోతుంది.
అతినీలలోహిత కిరణాల ప్రభావంతో వాహనం రంగు వెలిసిపోతుంది.
పార్కింగ్‌లో ఎక్కువ సేపు ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా కవర్లు కప్పాలి.
రాత్రి వేళల్లో పెట్రోలు కొట్టించాలి. ఆ సమయంలో వేడి తీవ్రత తక్కువగా ఉండి ఆవిరి కాకుండా ఉంటుంది.
అధిక వేడి వల్ల తరచూ టైర్లలో గాలి తగ్గిపోతుంది. అది గమనించి సరైన మోతాదులో గాలి నింపుకోవాలి.
ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణం చేయకపోవడం ఉత్తమం.
తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారి బండి ఆపాలి.
సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇంజిన్‌ ఆపివేయాలి. దీని వల్ల ఇంజన్‌ చల్ల బడి అధిక మన్నిక వస్తుంది.
వేసవిలో ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా శక్తి కోల్పోతుందని గమనించండి.
కనుక ఇంజిన్‌ ఆయిల్‌ ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్‌ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారైన బ్రేక్‌ షూలు, రబ్బరు విడిభాగాలు చెక్‌ చేసుకోవాలి.
అధిక వేడి వల్ల రబ్బరు విడిభాగాలు త్వరగా దెబ్బతింటాయి.

నాలుగు చక్రాల విషయంలో ఇలా...
కార్లు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్‌లో నీటిని తరచూ చెక్‌ చేసుకోవాలి.
నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్‌ ఫ్రీజ్‌ అయ్యే ప్రమాదం ఉంది.
రేడియేటర్‌లో నీళ్లకంటే కూలెంజ్‌  ఆయిల్‌ వాడడం మంచిది.
ఇంజిన్‌ ఆయిల్‌ తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక తరచూ ఆయిల్‌ లెవల్‌ చెక్‌ చేసుకోవాలి.
ఎండకాలం పూర్తయ్యే వరకూ కొత్త టైర్లు వాడాలి.
వేసవిలో టైర్లు వేయించాల్సి వస్తే సెకండ్స్, చైనా, రీబటన్‌ టైర్లు జోలికి వెళ్లకపోవడం మంచిది.
వాహనాన్ని పార్కింగ్‌ చేసేటప్పుడు నీడలో ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి.
లేనిపక్షంలో కవర్‌ కప్పి ఉంచాలి. ఎక్కువ సేపు ఎండలో ఉంటే వాహనం రంగు పాలిపోతుంది.
ఇప్పుడు వస్తున్న వాహనాలన్ని ప్యూజిల్‌ కంప్యూటర్లతో అనుసంధానమై ఉంటున్నాయి.
కనుక వాహనాల్లోని వైరింగ్‌ వ్యవస్థను ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్‌ చేసుకోవాలి.
కార్లకు పెట్రోల్‌ స్థానంలో ఎల్‌పీజీ గ్యాస్‌ కిట్‌లు అమర్చుకుని వాటిని ఉపయోగించే వారు ఈ వేసవిలో వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
వంట గ్యాస్‌ అసలు వినియోగంచరాదు.
అధిక ఉష్ణోగ్రతల వల్ల గ్యాస్‌ పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంది.
తప్పని సరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం ఎండతీవ్రత లేని వేళల్లో వాడటం మంచిది.
కారులో ఏసీ నిలబడేందుకు సెడ్‌ అద్దాలకు ఫిల్మ్‌ లేని వారు అద్దాలకు సరిపడా క్లాత్‌ మ్యాట్స్‌ లభిస్తున్నాయి. వాటిని అద్దాలకు అమర్చుకోవచ్చు.

మరిన్ని వార్తలు