ఒక పట్టాన చెవికెక్కదు

18 May, 2018 13:20 IST|Sakshi

వైఎస్‌ హయాంలో గిరిపుత్రులకు 5326 ఎకరాల పంపిణీ

బాబు అధికారంలోకొచ్చాక సెంటు భూమి ఇవ్ని వైనం

పట్టాల కోసం 26 వేల మంది ఎదురుచూపులు

వ్యవసాయ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పనిముట్లు.. వీటి గురించి టీవీ, పేపర్లలో వినడమేగానీ.. వారి దరి చేరింది లేదు. తరతరాలుగా చెమట చుక్కలను చిలకరించి పుడమి తల్లిని పులకరింపజేసి నాలుగు మెతుకులు తినడమేగానీ.. ఆ భూములు వారికి దక్కింది లేదు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఊరూరా తిరుగుతూ సాగు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారుగానీ.. నాలుగేళ్లుగా వారి గోడు పట్టించుకున్న దిక్కు లేదు. ‘మాకు పట్టాలివ్వండి మహాప్రభో’ అంటూ వచ్చిన 26 వేల దరఖాస్తులకు సమాధానం చెప్పే నాథుడు లేడు.

ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్రలో 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారు. ఫలితంగా భూములు సాగు చేసుకునేందుకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సాక్షి,అమరావతి బ్యూరో: జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 2.5 లక్షల మందికిపైగా గిరిజనులు ఉన్నారు. వీరు సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లాలో 28 వేల ఎకరాల భూమిని సర్వే చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేశారు. జిల్లాలో 3,200 మంది గిరిజనులకు 5,326 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు గిరిజనుల భూమి పట్టాల గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ 26 వేల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

భూమి సాగు చేసుకొనేందుకు తిప్పలు
ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో గిరిజనులు భూములు సాగు చేసుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్లు, ఎద్దులు, అరకలు తీసుకెళ్తున్నారు. వీటిని అటవీ అధికారులు అడ్డుకొని, వాటిని సీజ్‌ చేసి కేసులు పెడుతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో 32 మంది ఎస్టీలకు 118 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అయితే కొంత మంది ఆ పొలాలను దౌర్జన్యంగా లాక్కొని, ఎస్టీలు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకొంటున్నారు. ఎస్టీలు పలుమార్లు అధికారులకు సమస్యను విన్నవించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు. వెల్దుర్తి మండలం సిరిపురం తాండలో 200 మంది ఎస్టీలకు గాను కేవలం 70 మందికి మాత్రమే భూమి పట్టాలు ఇచ్చారు. అయితే వారు పొలాల వద్దనే గుడిసెలలో  నివాసం ఏర్పాటు చేసుకొని భూములు సాగు చేసుకొంటున్నారు. అక్కడ ప్రభుత్వం కనీçసం తాగునీటి వసతి కూడా కల్పించక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని వేడుకొంటున్నారు.

సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు
తరతరాలుగా భూములు దున్నుకొంటున్న గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు. వైఎస్సార్‌ హయాంలో మాత్రం అటవీ హక్కుల చట్టాన్ని విస్తృతంగా అమలు చేసి, భూమి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు గిరిజనులు తమ పొలాలను సాగు చేసుకొనేందుకు అడవికి వెళ్తుంటే అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
ఆర్‌.కృష్ణానాయక్, లంబాడి హక్కుల పోరాట సంఘం నేత

>
మరిన్ని వార్తలు