మంత్రి పదవి వచ్చింది కానీ..

16 Oct, 2018 06:59 IST|Sakshi

 మిల్లు తెరుచుకోలేదు

ఆరు నెలల్లో జూట్‌ మిల్లు తెరిపిస్తానన్న మంత్రి రంగారావు 

 వీధిన పడ్డ కార్మిక కుటుంబాలు

 ఈఎస్‌ఐ కూడా వర్తించక అవస్థలు  

బొబ్బిలి: బొబ్బిలిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్‌ మిల్లు మూతపడి నాలుగేళ్లయింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్మికులు ఆర్‌వీఎస్‌కే రంగారావుకు మిల్లును తెరిపించాలని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. తెరిపించే ప్రయత్నం అటుంచితే ఆయన వైఎస్సార్‌ సీపీని వీడి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత బొబ్బిలిలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో జూట్‌ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి ఒకటిన్నరేళ్లు అయినా నేటికీ మిల్లును తెరిపించలేదు. కనీసం కార్మికుల వేతనాలు ఇప్పించలేదు.

2013 జనవరి 23న మూసివేత.. 
బొబ్బిలి చుట్టు పక్కల మండలాల్లోని గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని బొబ్బిలి వచ్చిన కార్మికుల కుటుంబాలను చిదిమేస్తూ శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్‌ మిల్లు 2015 జనవరి 23న మూసేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రులకు తమ బతుకులు వీధిన పడ్డాయంటూ చెప్పుకున్నా కార్మికుల గోడును పట్టించుకునే వారే లేరు.  ఈ మిల్లులో 2,300 మంది కార్మికులకు పీఎఫ్‌ రూ. 2.60 కోట్లు, గ్రాట్యూటి రూ.1.50 కోట్లు, ఈఎస్‌ఐ రూ.1.80 కోట్లు, బోనస్‌ రూ.50 లక్షలు, కార్మికుల ఒకరోజు వేతనం రూ.3 లక్షలు, ఎల్‌ఐసీ రెన్యువల్‌ రూ.4 లక్షలు, కార్మికుల డెత్‌çఫండ్‌ రూ.లక్ష బకాయిలు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు యాజమాన్యం పత్తా లేకుండా పోయింది. సదరు యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి మిల్లును తెరిపించాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని కార్మికులు గొల్లుమంటున్నారు. కార్మికుల కష్టం నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఈ సొమ్ము కూడా యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల వారు ఈఎస్‌ఐకి కూడా అర్హులు కాకపోవడంతో అప్పులు చేసి మరీ  బయట వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 

35 కార్మికుల మరణం..
మిల్లు మూసేసిన తర్వాత నాలుగు మండలాలలో ఉన్న కార్మికులు దాదాపు 35 మంది చనిపోయారు. వారి బకాయిలు రాకపోవడంతో దిగాలుగా మంచం పట్టి రోగులుగా మారారు. ఈఎస్‌ఐకి అర్హులు కాకపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పలువురు కార్మికులు వలసబాట పోయి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ జీఎస్‌ఎస్‌కే శ్రీనివాసరావును వివరణ కోరగా నవంబర్‌ 6న రాష్ట్రస్థాయిలో ఈ మిల్లుపై అమరావతిలో చర్చలు జరుగుతాయని తెలిపారు.

మంత్రి హామీ ఏమైనట్టో..? 
గతంలో అనేకమార్లు సీఎంను, కార్మికశాఖా మంత్రిని, స్థానిక మంత్రి ని, అధికారులను కలిశా ం. ఎవరూ మా సమస్యలపై స్పందించ లేదు. ఇక్కడి ఎమ్మెల్యే మంత్రి అయ్యాక పెట్టిన సభలో ఆరు నెలల్లో మిల్లును తెరిపిస్తామన్నారు. సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. 
  –వి.శేషగిరిరావు, కార్మిక సంఘం అధ్యక్షుడు, లక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు, బొబ్బిలి.  

నరకయాతన అనుభవిస్తున్నాం..
నా భర్త పేరు బసవ రమణ. ఇక్కడి మిల్లులో పనిచేస్తూ చనిపోయాడు. ఆయనకు కంపెనీ నుంచి రూ.3.5 లక్షలు అందాలి. అది రాలేదు. పింఛన్‌ రావడం లేదు. మిల్లు మూసేయడంతో íపిల్లలను కూలి పనులు చేస్తూ పోషిస్తున్నా. కుమార్తె డిగ్రీ చదువుతుంది. కుమారుడు ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నాడు. భర్త జీవించినపుడు సంతోషంగా ఉన్నాం. ఆయన మరణం తర్వాత నరకయాతన అనుభవిస్తున్నాం.
– బసవ కళావతి, మరణించిన 

కార్మికుడి భార్య.41 ఏళ్ల సర్వీసు..
మిల్లులో రూ.3 జీతం నుంచి పనిచేశా. 41 ఏళ్ల సర్వీసు ఉంది. చివరిలో యాజమాన్యం తీరు వల్ల నానా అవస్థలు పడుతున్నాం. స్థానికంగా మంత్రి ఉన్నా మా సమçస్య పరిష్కారం కావడం లేదు. హక్కుల కోసం మేం రోడ్డెక్కాల్సి రావడం దారుణం.
              – బొంతలకోటి సత్యం, కార్మికుడు, కింతలివానిపేట.

మరిన్ని వార్తలు