నమో.. తిరుమలేశా

28 Sep, 2017 02:12 IST|Sakshi

అంగరంగ వైభవంగా గరుడ వాహన సేవ

సాక్షి, తిరుమల: విశ్వపతి వేంకటేశ్వరుడు బుధవారం గరుడునిపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకూ సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల.. వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ తులసి, పుష్పమాల, చెన్నయ్‌ నూతన ఛత్రాలు(గొడుగులు) అలంకరించారు.

అశేష జనవాహిని గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. ప్రారంభం నుంచి.. ముగిసే వరకూ వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని  దర్శించుకునేలా టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు కోలాహలంతో సాగాయి. గురువారం శ్రీవారి స్వర్ణరథాన్ని (రథరంగ డోలోత్సవం) ఊరేగించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేగింపు ప్రారంభంకానుంది.

గరుడోత్సవంలో గజరాజు హల్‌చల్‌ 
తిరుపతి మెడికల్‌: శ్రీవారి గరుడోత్సవంలో గజరాజు హల్‌చల్‌ చేసింది. మాడ వీధుల్లో కళాబృందాల ప్రదర్శనలో వాయిద్యాల చప్పుళ్లకు బెదిరిపోయింది. దీంతో ఆలయం ఎదుట ఉన్న గ్యాలరీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో మావటి గజరాజును అదుపుచేయడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు