ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాలు ప్రైవేటు పరం?

28 Sep, 2017 02:05 IST|Sakshi

త్వరలో కేబినెట్‌ ముందుకు ప్రతిపాదన

ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీకి చెందిన కీలక చమురు క్షేత్రాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో ఉంది. చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్న ముంబై హై తదితర నామినేషన్‌ బ్లాకుల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలను అనుమతించాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను చమురు శాఖ త్వరలోనే కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 1999 నుంచి నూతన వెలికితీత లైసెన్స్‌ విధానం (ఎన్‌ఈఎల్‌పీ) కింద వేలంలో కేటాయించిన బ్లాకుల్లోనే ప్రైవేటు కంపెనీలు పాల్గొనేందుకు అనుమతి ఉంది. దీనికి ముందు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు చేసిన కేటాయింపులన్నీ నామినేషన్‌ విధానంలోనే కొనసాగాయి. ఇప్పుడు ఈ తరహా బ్లాకుల్లోనే మెజారిటీ వాటా కొనుగోలుకు ప్రైవేటు కంపెనీలను అనుమతించనున్నారు. ఓఎన్‌జీసీ తన మొత్తం చమురు ఉత్పత్తి 25.53 మిలియన్‌ టన్నుల్లో 87 శాతం నామినేషన్‌ విధానంలో కేటాయించిన బ్లాకుల నుంచే కావడం గమనార్హం.

అలాగే, 23.38 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌లో 95 శాతం ఈ తరహా బ్లాకుల నుంచే వస్తోంది. దేశంలో అతిపెద్ద చమురు క్షేత్రమైన ముంబై హై, అతిపెద్ద గ్యాస్‌ క్షేత్రం బస్సీన్‌ కూడా నామినేషన్‌ విధానంలో కేటాయించినవే. అయితే, ఈ తరహా చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో ఉత్పత్తి పెరగకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుండడంతో... ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు, టెక్నాలజీతో దీన్ని సాధ్యం చేస్తాయని భావిస్తోంది.  

ఐవోసీ, గెయిల్‌లో ఓఎన్‌జీసీ వాటాల అమ్మకం?
హెచ్‌పీసీఎల్‌ను కొనేందుకే ఈ నిర్ణయం..!
న్యూఢిల్లీ: ఇండియల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించే అవకాశం ఉందని ఓఎన్‌జీసీ తెలిపింది. హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఓఎన్జీసీ కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు కావాల్సిన రూ.33,000 కోట్ల నిధుల సమీకరణపై కంపెనీ దృష్టి పెట్టింది. కంపెనీకి రుణాలు ఏవీ లేవని, రూ.25,000 కోట్లను రుణాల రూపంలో సమీకరించేందుకు వాటాదారుల అనుమతి తీసుకున్నట్టు ఓఎన్‌జీసీ చైర్మన్, ఎండీ దినేష్‌ కె.సరాఫ్‌ తెలిపారు.

‘‘హెచ్‌పీసీఎల్‌ కొనుగోలుకు కావాల్సిన నిధుల సమీకరణకు మా ముందు పలు అవకాశాలున్నాయి. స్టాండలోన్‌గా చూసుకుంటే కంపెనీకి ఎటువంటి రుణాలు లేవు. కనుక మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకోగలం. మాకున్న పెట్టుబడులను కూడా అమ్మే అవకాశం ఉంది’’ అని సరాఫ్‌ వివరించారు. ఐవోసీలో ఓఎన్‌జీసీకి 13.77 శాతం వాటా ఉంది. దీని మార్కెట్‌ విలువ రూ.26,450 ఓట్లు. గెయిల్‌లో 4.87 శాతం వాటా ఉండగా, దీని విలువ రూ.1,640 కోట్లు. వాటాల విక్రయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ ముందున్న అవకాశాల్లో ఇదీ ఒకటన్నారు.   

మరిన్ని వార్తలు