రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోం

13 Sep, 2013 03:53 IST|Sakshi
 మార్టూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఉద్యోగులు, విద్యార్థులు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మార్టూరులో గురువారం మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్టూరు తహ సీల్దార్ సుధాక ర్‌బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉన్న ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.వెంకట్రావు మాట్లాడుతూ సీమాంధ్ర రాజకీయ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పదవులకు రాజీనామా చేయకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఏపీ ఎన్‌జీవో సభకు హెదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేసినా సీమాంధ్ర రాజకీయ నాయకులు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.
 
 జాతీయ రహదారిపై భారీ ర్యాలీ 
 మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తొలుత సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆకారంగా ఏర్పడ్డారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర.. నినాదంతో జాతీయ రహదారి మార్మోగింది. గన్నవరం సెంటర్ నుంచి నాగరాజుపల్లి సెంటర్ వరకు వర్షంలో ర్యాలీ కొనసాగింది. తర్వాత గన్నవరం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం కళాకారులు కోలాటం ప్రదర్శించారు. ఎన్‌సీసీ విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం రోడ్డుపై కవాతు చేశారు.
 
 మూతపడిన దుకాణాలు 
 మార్టూరు మహాధర్నా కారణంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. సుమారు గంటపాటు జాతీయ రహదారిపై ధ ర్నా జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కార్యక్రమంలో మార్టూరు, బల్లికురవ ఎంఈవోలు కిషోర్‌బాబు, నాగేశ్వరరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు గోపి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు, వ్యవసాయశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయి చిహ్నిత, హర్షిణి, రాయల్ కాలేజీ, రాయల్ స్కూల్, శ్రీనివాస స్కూల్, కాకతీయ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. 
 
మరిన్ని వార్తలు