1.85 లక్షల ఎకరాలకే సాగునీరు

6 Apr, 2014 02:54 IST|Sakshi
1.85 లక్షల ఎకరాలకే సాగునీరు

 సాక్షి, నెల్లూరు: సోమశిల రిజర్వాయర్ కింద రెండో పంటకు 2 లక్షల 43 వేల ఎకరాల ఆయకట్టుకు మే ఒకటి నుంచి నీళ్లివ్వాలన్న  జిల్లా సాగునీటి సలహామండలి తీర్మానానికి  స్టేట్‌లెవల్ కమిటీ ఫర్ వాటర్ మేనేజ్‌మెంట్ ‘నో’ చెప్పింది. హైదరాబాద్‌లోని ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్  కార్యాలయంలో శుక్రవారం సమావేశమైన కమిటీ ప్రత్యేకంగా సోమశిలలో ప్రస్తుతమున్న నీటితో పాటు మే ఒకటి నాటికి లభ్యమయ్యే నీటి వివరాలను పరిగణలోకి తీసుకుని చర్చించింది.

 జిల్లా ఐఏబీ తీర్మానించినట్లు 2 లక్షల 43 వేల ఎకరాల పెన్నాడెల్టా ఆయకట్టుకు రెండో పంటకు నీళ్లివ్వడం కుదరదని తేల్చింది. నీటి లభ్యత ఆధారంగా  కేవలం 1 లక్షా 85 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చే అవకాశముందని తీర్మానించి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. ఇదే విషయాన్ని  ఈ నెల తొమ్మిదిన జరిగే సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించనున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని జిల్లా ఇరిగేషన్ అధికారులకు సైతం తెలియెప్పింది. దీంతో కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఐఏబీ తీర్మానంలో నిర్ణయించినట్లు సోమశిల పరిధిలో రెండోపంటకు 2 లక్షల 43 వేల ఎకరాల్లో దాదాపు 70 వేల ఎకరాలకు నీళ్లు అందే అవకాశం లేకుండా పోయింది.

 సోమశిల పరిధిలో రెండో పంటకు 2 లక్షల 47 వేల ఎకరాల  పెన్నా, సంగం డెల్టా  ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు మార్చి 15న జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటించారు. సోమశిలలో ప్రస్తుతం ఉన్ననీరు 38.755 టీఎంసీలతో పాటు భవిష్యత్తులో లభ్యమయ్యే నీటితో కలిపి 43.860 టీఎంసీలుగా గుర్తించారు. ఇందులో ఖరీఫ్ పంటకు ఏప్రిల్ 15వ తేదీ వరకూ ఇవ్వాల్సిన 6.735 టీఎంసీలు నీరు పోనూ సోమశిలలో 37.125 టీఎంసీల నీరు ఉంటుందని లెక్కలు కట్టారు.


 ఇందులో డెడ్‌స్టోరేజీ, ఆవిరి, కావలి, నెల్లూరు, అల్లూరు ప్రాంతాల తాగునీటి అవసరాలకు పోనూ 27.6259 టీఎంసీలుగా తేల్చారు. ఒక్క టీఎంసీ నీటితో 8 వేల ఎకరాల చొప్పున 2 లక్షల 21 వేల ఎకరాల ఆయకట్టుకు ఉన్ననీటితో సాగుచేయవచ్చని అధికారులు   కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

 అనంతరం రైతు సంఘాల నేతలు, ఇరిగేషన్ అధికారులతో చర్చించిన కలెక్టర్ వారి సూచనల మేరకు పెన్నా, సంగం డెల్టాలోని మొత్తం 2లక్షల 47 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని తీర్మానించిన విషయం విదితమే. అయితే ఐఏబీ తీర్మానం కేవలం కాగితాలకే పరిమితమైంది.

మరిన్ని వార్తలు