పని ‘గట్టు’కుని పండిస్తున్నారు..!

12 Dec, 2019 09:42 IST|Sakshi
కనుచూపు మేరలో బంతి మొక్కలు

ఊరంతా బంతిపూలే

పొలం గట్టుపై బంతిపూల సాగు

రాజుల కాలం నుంచి  బంతిపూలతో రెంటికోటకు అనుబంధం 

రాజ్యాలు పోయాయి. రాజులూ పోయారు. కానీ రాచరికపు ఆనవాలుగా బంతిపూలు ఇప్పటికీ ఆ ఊరి గడపన గుభాళిస్తున్నాయి. వందల ఏళ్లుగా బంతితో పెనవేసుకుపోయిన వారి అనుబంధం ఇంకా పచ్చగానే పరిఢవిల్లుతోంది. ఒకప్పుడు వ్రతాలు, పూజల కోసం పొలం గట్లపై బంతిపూలను సాగు చేసిన రెంటికోట గ్రామస్తులకు ఇప్పుడు అదే జీవనాధారమైంది. అంతరపంటగా బంతి సాగు చేస్తున్నా.. అసలు ఆదాయాన్ని ఈ పంటే తెచ్చి పెడుతోంది. అదెలాగంటే.. 

కాశీబుగ్గ : రాజ వంశీయులకు, కుటుంబాలకు కోటలో జరిగే పూజలకు, వ్రతాలకు వినియోగించే పూలను అందించే గ్రామంగా రెంటికోట రెండు వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ గ్రామంలో ఎటుచూసినా బంతిపూలే కనిపిస్తుంటాయి. పంటపొలాల్లో పండిస్తున్న పంటలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అంతర పంటగా బంతిని పండిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రారంభించి సంక్రాంతి వెళ్లిన వరకు పూల సేకరణ కొనసాగిస్తారు. ఏ రోజుకు ఆరోజు చేతికందిన పూలను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇంటి ఆవరణతోపాటు పంటపొలాలు, ఖాళీ స్థలాలను సైతం వినియోగిస్తుంటారు. ఏటా వివిధ రకాల మొక్కలతో పా టు బంతిపూలకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతర ప్రక్రియగా పండిస్తున్నారు.  

ఒడిశా, ఆంధ్రా సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామంలో అధిక మంది ఒరియా వేషభాషలను పాటిస్తుంటారు. వీరంతా పలాస–కాశీబుగ్గ, మందస, గొప్పిలి, హరిపురం ప్రాంతాలకు పూలను తరలించి విక్రయిస్తుంటారు. అయ్యప్పస్వామి, భవానీ, శివ, గోవింద, శ్రీరా మ మాలలు వేసుకున్నవారే వీరి ప్రధాన కస్టమర్లు. పరిసర ప్రాంతాలలో ఎవరి ఇళ్లల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు చే సినా రెంటికోట గ్రామ బంతిపూలు ఉండాల్సిందే.
 
ఆ మట్టితో విడదీయరాని బంధం.. 
ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ విత్తనాలు ఎక్కడ చల్లినా మొక్కలవుతాయి. ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు. బంతిపూలకైతే ప్రతి ఇంటి ఆవరణాన్ని వినియోగిస్తారు. సమీపంలోని తర్లాకోట రాజవారి కోటకు ఇక్కడి పూలను వినియోగించే వారని ప్రతీతి.

పొలం గట్టును నమ్ముకుంటారు.. 
పొలాలను నమ్ముకుని పంటలను పండిస్తున్న రైతులను చూసి ఉంటాం గానీ పొలం గట్టును సైతం విడవకుండా అంతరపంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. సొంత పొలం లేకున్నా బంధువులు, మిత్రులకు సంబంధించిన పొలం గట్లపై అనుమతులు తీసుకుని బంతి మొక్కలను పెంచుతున్నారు.  

రోజుకు రూ.500 వరకు అమ్ముతాం
వరి పంటలను పండిస్తున్న పంటతో సంబంధం లేకుండా బంతి పంటను పండిస్తాం. ఈ క్రమంలో సుమారు 300 మీటర్ల విస్తీర్ణంలో పంటను పండిస్తున్నాం. రోజుకు ఐదు వందల రూపాయలు వస్తుంది. ఒకోసారి వెయ్యి రెండు వేలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పలాస, కాశీబుగ్గతో పాటు ఇతర పట్టణాల నుంచి స్వయంగా ఇంటికి వచ్చి మరీ కొనుగోలు చేస్తారు. 
– రంభ దొర, బంతిపూల సాగుచేసే మహిళా రైతు, రెంటికోట 

పరస్పరం పంటలకు రక్షణ..
రెంటికోట గ్రామంలో ఉన్న పంట పొలాల్లో బంగారం పండుతాయని చెప్పవచ్చు. ఇక్కడ మట్టి సారవంతమైనది. ఇక్కడ పంటలకు మధ్యలో ఉన్న గట్లపై బంతిని పెంచుతున్నాము. దీని ద్వారా పశువులు గట్లపైకి రావడానికి అవకాశం లేకుండా రక్షణగా ఉంటుంది. ఇదే క్రమంలో బంతి మొక్కలు పాడవకుండా వరిచేను రక్షణగా ఉంటుంది. గ్రామంలో వందల మంది మహిళలు పురుషులతో సంబంధం లేకుండా వీటిని పండిస్తారు.
– పుచ్చకాయల కుమారి, మహిళారైతు, రెంటికోట

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా