రుణాలు రాక.. కష్టాలు తీరక

4 Apr, 2019 09:04 IST|Sakshi

మైనారిటీల రుణాల ఎంపికలో అర్హులకు మొండిచెయ్యి

జన్మభూమి కమిటీలదే పెత్తనం

ఎంపికైన అభ్యర్థులకు నేటికి అందని సబ్సిడీ రుణాలు 

సాక్షి, కంభం (ప్రకాశం): ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం అర్హులకు అందలేదు. ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలదే పెత్తనం, రుణాలైనా, రేషన్‌కార్డులైన, పించన్‌లైనా ఇలా ఏది చూసుకున్నా పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితమైపోతున్నాయని అర్హులకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక మైనారిటీ కార్పోరేషన్‌ ద్వారా ముస్లింల సబ్సిడీ రుణాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనమే సాగింది వారు చెప్పిన వారిపేర్లనే అధికారులు ప్రతిపాదించారు. పోనీ వాళ్లకైనా రుణాలు ఇచ్చారా అంటే అదికూడాలేదు. 2018–19కి గానూ జిల్లాలో 11812 మంది మైనారిటీలు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా ఒక్కరికి కూడా నేటికి ఒక్కరుపాయి రుణం అందలేదు. దీంతో టిడిపి కార్యకర్తలు సైతం ప్రభుత్వం తీరుతో విస్తుపోయి  సబ్సిడీ రుణాలపైన ఆశలు వదులుకున్నట్లు కన్పిస్తుంది.

అర్హులకు అందని రుణాలు
సబ్సిడీ రుణాలు ఒక్కరి ఖాతాలో కూడా జమ కాలేదు. ఒంగోలు మైనారిటీ కార్యాలయానికి వెళ్లి ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లు కూడా అందజేసామని రుణాలకు ఎంపికైన అభ్యర్థులు తెలిపారు. త్వరలో బ్యాంకుల్లో లోన్ల డబ్బులు పడతాయని అధికారులు చెప్పినా నేటికి ఒక్కరుపాయి కూడా ఎవరికి అందలేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు కూడా వచ్చేయడంతో తమకు ఇక రుణాలు వస్తాయో లేదో అన్న అనుమానం కలుగుతుందని వాపోతున్నారు. కొందరు టీడీపీ నాయకులు రుణాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.

మండలం మంజూరైన యూనిట్లు వచ్చిన రఖాస్తులు
కంభం 69 554
బేస్తవారిపేట 34 144
గిద్దలూరు 37 237
రాచర్ల 36 265
కొమరోలు 53 267
అర్థవీడు 59 144

జన్మభూమి కమిటీలతో నష్టపోయా..
ఇప్పటికీ నాలుగుసార్లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను.  జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో నాకు ఒక్కసారి కూడా రుణం మంజూరు కాలేదు. అధికారులు సైతం వారి మాటలే వినడంతో నాకు రుణం మంజూరు కాలేదు.
–మహబూబ్‌ వలి, కందులాపురం

ప్రతి ఏడాది దరఖాస్తు చేస్తున్నాను..
రుణం కోసం ప్రతి ఏడాది దరఖాస్తు చేసి కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తున్నాను. ఇప్పటికి ఒక్కసారి కూడా మంజూరు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగక పోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతుంది. 
- షేక్‌.మస్తాన్‌వలి

రుణం వస్తే వ్యాపారం చేసుకుందామనుకున్నాను..
మైనారిటీ రుణం వస్తే చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చులే అనుకున్నాను. లోను మంజూరైందో లేదో కూడా తెలియడం లేదు. దీంతో కష్టంగా ఉన్న బేల్దారు పనికి పోతున్నాను. 
–నాయబ్‌ రసూల్, కంభం

లబ్ధిదారుల జాబితా అప్‌లోడ్‌ చేశాం..
అర్హులను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు  అప్‌లోడ్‌ చేశాం. మైనారిటీ కార్పొరేషన్‌ రేషన్‌ నుంచి మంజూరు కావాల్సి ఉంది. ఇతర కార్పొరేన్లకు సంబంధించి కూడా ఎవరికి రుణాలు  మంజూరు కాలేదు. దీనిపై అధికారులతో సమీక్షిస్తాం.
–ప్రసూనాదేవి, ఎంపీడీఓ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు