సమర పథంలో...

13 Dec, 2013 00:32 IST|Sakshi

సాక్షి, కాకినాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో హోరెత్తుతోంది. ఏపీ ఎన్జీఓల సమ్మె విరమణతో కాస్త ఊపుతగ్గిన ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త ఊపిరులూదింది. రాష్ట్ర విభజన బిల్లు రాష్ర్టపతి నుంచి అసెంబ్లీకి చేరుకున్నా- సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయస్థాయిలో చేస్తున్న ఉద్యమంతో ఏదో ఒక దశలో విభజన ఆగిపోతుందన్న నమ్మకం సమైక్యవాదుల్లో బలంగా కనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే జగన్ ఇచ్చిన ప్రతి పిలుపునకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఆ క్రమంలోనే గురువారం పార్టీ పిలుపు మేరకు రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. గంటల తరబడి సాగిన ఆందోళనలో సమైక్యవాదులు కదంతొక్కారు.

 వంటావార్పులు, దిష్టిబొమ్మల దహనాలు, మానవ హారాలు, ధర్నాల వంటి నిరసన కార్యక్రమాలకు రహదారులు వేదికలయ్యాయి. సమైక్యనినాదాలతో మార్మోగాయి. జిల్లా మీదుగా వెళ్లే 16, 216 నంబర్ల జాతీయ రహదారులతో పాటు పలు చోట్ల ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారులనూ దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సహా జిల్లాలో పలు చోట్ల జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సుమారు 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గోకవరం పాత బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద జాతీయ రహదారి- 216ని కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావుల ఆధ్వర్యంలో  పార్టీ శ్రేణులు దిగ్బంధించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చిట్టబ్బాయి, మహేశ్వరరావులతో పాటు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాకినాడ భానుగుడి సెంటర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 సోనియా తదితరుల దిష్టిబొమ్మల దహనం
 మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం వద్ద జాతీయ రహదారి-16ని దిగ్భందించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, జిల్లా సేవాదళ్, వాణిజ్య విభాగాల కన్వీనర్లు మార్గన గంగాధర్, కర్రి పాపారాయుడు, జిల్లా అధికారప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజులతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని సోనియా తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారి-16పై మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బా రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో లాలాచెరువుసెంటర్‌లో జాతీయ రహదారి -16ని పార్టీ శ్రేణులు దిగ్బంధించగా బొమ్మన, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్‌లతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.

 కాకినాడ రూరల్ మండలం పండూరు జంక్షన్‌లో 216 జాతీయ రహదారిని నియోజకవర్గ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీచైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, చంద్రబాబు తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పిఠాపురం బైపాస్‌రోడ్‌లో 216 జాతీయ రహదారిని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. మండపేట కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణల ఆధ్వర్యంలో ద్వారపూడి వంతెన వద్ద కాకినాడ-రాజమండ్రి కెనాల్‌రోడ్‌ను దిగ్బంధించారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కొట్టాం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ ఎంపీపీ మాకినీడి గంగారావు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జి తదితరులతో పాటు పెద్దసంఖ్యలోపార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
 అక్విడెక్టుపై వంటావార్పు
 మలికిపురం మండలం దిండి వద్ద చించినాడ వంతెనపై  రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్టుపై పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, మందపాటి కిరణ్‌కుమార్, మిండగుదిటి మోహన్, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరుల ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. నగరంలో గ్యాస్ కలెక్షన్ సెంటర్ ఎదుట కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రంపచోడవరం మండలం పందిరిమామిడి వద్ద స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి-భద్రాచలం రహదారిని కొద్దిసేపు దిగ్బంధించారు. ముమ్మిడివరం కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి వంటావార్పు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బొమ్మూరు సెంటర్‌లో జాతీయ రహదారి-16ని దిగ్బంధించారు. సామర్లకోట రైల్వేస్టేషన్ సెంటర్‌లో రహదారి దిగ్బంధనం జరిగింది. కోరుకొండలో జరిగిన ‘గ డపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్యనాదం’ కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా