తనిఖీలతో హడలెత్తించిన డిప్యూటీ సీఎం

16 May, 2015 05:02 IST|Sakshi
తనిఖీలతో హడలెత్తించిన డిప్యూటీ సీఎం

కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన
విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై మండిపాటు
దళారులను దూరంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు

 
 సాక్షి, కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యంత్రి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు కేఈ కృష్ణమూర్తి చేపట్టిన ఆకస్మిక తనిఖీ ఆ శాఖ ఉద్యోగుల్లో దడ పుట్టించింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక  మొదటిసారిగా తన సొంత శాఖకు చెందిన కార్యాలయాల్లో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్టి, సొంత శాఖ ప్రక్షాళనకు ఆయన నడుబింగించారు.

అందులో భాగంగా కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి ఆయన ఉదయం 10.30 గంటలకే చేరుకుని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తొలుత కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్న వారిపై మండిపడ్డారు. ఎవరెవరు రాలేదని ఆరా తీశారు. వారందరికీ హాజరు పట్టికలో గైర్హాజరు వేయించారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కారాదని వారిని తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సెంట్రల్ సర్వర్ పనిచేస్తుందా లేదా అని అదే కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.

వారం రోజుల వ్యవధిలో ఎన్ని రిజిస్ట్రేషన్‌లు స్కానింగ్ చేశారనే వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 14వ తేదీ గురువారం ఒక్కరోజు 32 డాక్యుమెంట్లు, రూ 6.50 లక్షల ఆదాయం వచ్చిందని సబ్‌రిజిస్ట్రార్ వెంకటరమణారావు వివరించారు. అక్కడి నుంచి నేరుగా రికార్డు గదిలోకి వెళ్లి రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో  సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు విధులకు హాజరుకావడంతో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తనిఖీలు..
  కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ డిప్యూటీ సీఎం తనీఖీ చేశారు. జూనియర్ అసిస్టెంట్, కర్నూలు జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్ కూడా సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా రిజిస్ట్రార్ శివగోపాల్ ప్రసాద్ కూడా సమయానికి విధుల్లో లేకపోవడంతో ఆయన ఎక్కడా అని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. అతను హైదరాబాద్‌కు డ్యూటీ నిమిత్తం వెళ్లారని సిబ్బంది తెలుపుగా..  పేర్కొనగా.. అసలు ఆయన ఆన్‌డ్యూటీపై వెళ్లారా... సెలవు పెట్టారా... అన్న సమాచారం రిజిస్టర్‌లో పేర్కొనకపోతే ఎలా అని కేఈ కోపోద్రిక్తుడయ్యారు.

కర్నూలు కార్యాలయంలో వస్తున్న ఆదాయం గురించి జాయింట్-1 మహబూబ్‌బాషను అడిగారు. గత నెల ఏప్రిల్‌లో టార్గెట్ 2.44 కోట్లు ఉండగా ఆదాయం రూ 5.84 కోట్లు వచ్చిందని వివరించారు. ఈ ఆదాయం కూడా కేవలం బిర్లా కాంపౌండ్ స్థలాల్లో నిర్మితమవుతున్న బిల్డింగులు, అపార్ట్‌మెంట్ల అమమ్మకాలు కొనుగోలు జరుగుతుండటంతో వస్తుందని డిప్యూటీ సీఎంకు జాయింట్-1 వివరించారు. ఇదే సమయంలో దళారులపై ప్రమేయంపై కేఈ ఆరా తీశారు. వారి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లను చేపట్టాలని, వారిని దూరంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఓ కంటింజెంట్ ఉద్యోగి తనకు రెండు నెలలుగా వేతనం రాలేదని చెప్పగా వెంటనే సంబంధిత ఫైలును పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ఆయన  హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో భద్రతా సిబ్బంది ఎవ్వరిని కార్యాలయాల్లోకి అనుమతించలేదు. అయితే పోలీసులు అడ్డుకున్న వారంతా కార్యాలయ సిబ్బంది కావడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు