ఎత్తిపోతున్న పథకాలు

31 Dec, 2013 02:57 IST|Sakshi

 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సాగునీటి సౌకర్యం లేని భూములను, బీడు భూములను బంజర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 355 ఎత్తిపోతల పథకాలను వందల కోట్లు వెచ్చించి నిర్మించినా..ప్రస్తుతం వాటిలో వందకు పైగా అసలెందుకూ పనికిరాకుండా పోయాయి. జిల్లాలోని ఎత్తిపోతల పథకాల స్థితిగతులను న్యూస్‌లైన్ బృందం సోమవారం పరిశీలించింది. సాగునీటి వసతి లేని పొలాలకు దగ్గరలో కానీ, కొంత దూరంలో నీటి పారుదల ప్రాంతాలుంటే అక్కడ నుంచి నీటిని సాగు భూములకు అందించడం ఎత్తిపోతల పథకాల ఉద్దేశం.

 జిల్లాలో పుష్కలంగా వాగులు, ఏరులున్నా..వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. గుండ్లకమ్మ, ముసి, పాత ముసి, పాలేరు, మన్నేరు, అట్లేరు, ముట్లేరు, ఉప్పుటేరు, ఎలికేరులు జిల్లాలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటితో పాటు రాళ్లపాడు, దున్నపోతువాగు, ఉప్పువాగు, ఎర్రవాగు, చిల్లాకాలువ, పందివాగు తదితర నీటి వనరులున్నాయి. వీటిపై కొత్తగా ఎత్తిపోతల పథకాలు ఐదేళ్లుగా ఒక్కటి కూడా మంజూరు కాకపోగా..ఇప్పటికే ఉన్నవి గాడితప్పాయి. జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట పండించుకునే వీలుండగా, మరో లక్ష ఎకరాల్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసుకోవచ్చు.

 అయితే వాటిలో కనీసం 50 వేల ఎకరాలు కూడా సక్రమంగా సాగుచేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొండపి నియోజకవర్గంలో పది పథకాలుంటే ఐదు పనికిరాకుండా పోయాయి. సింగరాయకొండ మండలంలోని కనుమళ్లకు చెందిన 500 ఎకరాలు సస్యశ్యామలం చేసేందుకు * 215 లక్షలు వెచ్చించి నిర్మిస్తే.. ఆ నిధులు మొత్తం మన్నేటిలో కలిసినట్లే అయింది. అసలు మోటార్లు మాయమయ్యాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో 6 పథకాలకుగాను ఒక్క ఎమిలేయర్ చానల్ స్కీం ఒక్కటే పంటలకు జీవం పోస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో నాలుగు పథకాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది.  

 మోటార్ల మరమ్మతులే పెద్ద సమస్య
 ఎత్తిపోతల పథకాలకు ప్రధాన సమస్య మోటార్లు. కంపెనీ మోటార్లు ఏర్పాటు చేయకపోవడం, అసంబ్లింగ్ మోటార్లు ఎక్కువగా పథకాలకు పెట్టడం వలనే తరచూ సమస్య వ స్తోంది. బిల్లులు మాత్రం కంపెనీ మోటార్ల పేరుమీదే ఉంటాయి. దీనికి తోడు విద్యుత్ సర్వీస్ ఈ స్కీమ్‌కు కేటగిరీ-4 కింద ఉండటంతో యూనిట్ ధర భారంగా మారుతోంది. ఒక్కో యూనిట్ ధర *5.37 లు కావటం, నెలకు బిల్లులు వేలల్లో రావడంతో వాటిని కట్టలేక రైతులు అల్లాడుతున్నారు. పథకం నిర్వీర్యం కావడానికి ఇదొక కారణం కూడా. కనీసం పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు కూడా సాగునీటి కోసం వినియోగించే ఎత్తిపోతల పథకాలకు ఇవ్వకపోవడం దారుణం.

 97 పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం - వై.వెంకటేశ్వరరావు, ఈఈ
 జిల్లాలో మూతపడిన 97 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటి మరమ్మతుల కోసం *51 కోట్లు నిధులు అవసరమవుతాయని పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, నిధులు విడుదలైతే జిల్లాలో పూర్వ వైభవం చవి చూడవ చ్చు. వేటపాలెం మండలం మోటుపల్లి పథకాన్ని *3.30 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. అదే విధంగా నాయినపల్లి పథకానికి *2.5 కోట్లతో పనులు జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు