Sakshi News home page

నూతనోత్సాహం

Published Tue, Dec 31 2013 2:26 AM

New Year party

= కొత్త సంవత్సరాదికి స్వాగత సన్నాహాలు
 = ముస్తాబైన బెంగళూరులోని ఎంజీ, బ్రిగేడ్ రోడ్లు
 = హోటళ్లు, పబ్‌లు, థెక్‌లు, రెస్టారెంట్లలో పలు కార్యక్రమాలు
 = సొమ్ము చేసుకుంటున్న యజమానులు
 = ఈ రోజు రాత్రి 8 నుంచే సంబరాలు
 = కిటకిటలాడనున్న పర్యాటక స్థలాలు

 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా కొత్త సంవత్సరాది వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులే వేడుకలకు ప్రధాన కేంద్రాలు. యువతీ యువకులు 31వ తేదీ రాత్రి అక్కడ చిందులు వేయడం ఆనవాయితీ. నగరంలోని హోటళ్లు, పబ్బులు, థెక్‌లు, రెస్టారెంట్లు వేడుకలకు సింగారించుకుంటున్నాయి. క్లబ్బుల సంగతి సరేసరి. తమ సభ్యుల కోసం వినోదభరిత కార్యక్రమాల కోసం చక చకా ఏర్పాట్లు చేస్తున్నాయి.

సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అర్ధ రాత్రి వరకు సంబరాలు జరుపుకోవడానికి అన్ని సదుపాయాలను కల్పించారు. రిసార్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో సైతం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. క్లబ్బులలో ప్రముఖ సెలబ్రిటీలతో నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 31వ తేదీ రాత్రికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రిసార్టులు సొమ్ము చేసుకుంటున్నాయి. గదుల అద్దెను రెండింతలు పెంచేశాయి. వాటిల్లో మద్యం ధరలు ఆ రాత్రి చాలా ఘాటుగానే ఉంటాయి.

శ్రీమంతులు కొత్త సంవత్సరాది వేడుకలకు ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక స్థలాలు, విదేశాలకు వెళుతుంటారు. ఇప్పటికే పర్యాటక స్థలాల్లోని హోటళ్లన్నీ రిజర్వు అయిపోయాయి. చివరి నిముషంలో ఎటో వెళ్లాలని నిర్ణయించుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఎక్కడా ఖాళీలు లేవని సమాధానం వస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలకు చేతి నిండా పని. ఇక సొంత ఊళ్లలో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించిన వారు సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. దీంతో బస్టాండ్లన్నీ. బస్సు, రైలు టికెట్ల కౌంటర్ల వద్ద చాంతడంతా క్యూలు కనిపించాయి.
 

Advertisement
Advertisement