శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు సీజే

25 Nov, 2019 03:43 IST|Sakshi
ఆదివారం సుప్రీంకోర్టు సీజే బాబ్డేకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్, అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి

ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి కూడా..

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం కుమారుడు శ్రీనివాస్‌ బాబ్డేతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరిలకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు.. శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీవారిని దర్శించుకుని.. స్వామివారి ఆశీర్వాదం పొందడం గొప్ప అనుభవమని చెప్పారు. శ్రీవారి ఆలయం, పరిసరాలు, శిల్ప సౌందర్యం కొత్త అనుభూతినిస్తాయన్నారు. శ్రీవారి ఆలయ నిర్వహణ తీరును ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో తిరుపతి అర్బన్‌ ఎస్పీ గజారావ్‌ భూపాల్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వీజీఓ మనోహర్, పేష్కార్‌ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు