జిల్లాలో స్వైన్‌ ఫ్లూ జాడలు!

27 Oct, 2018 13:49 IST|Sakshi
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డు

ఇప్పటికే ఇద్దరికి సోకినట్లు వైద్యుల ధ్రువీకరణ

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

2017లో మూడు మాసాల్లో16 కేసులు నమోదు

ఏడాది అనంతరం మళ్లీ జిల్లాపై పంజా

సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం:  జిల్లాలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. 2017లో జనవరి నుంచి మార్చి నెలాఖరుకు 16 మందికి సోకిన ఈ వ్యాధి తాజాగా ఇద్దరికి విస్తరించింది. వ్యాధి బారినపడిన వీరు విజయవాడ, నెల్లూరులో చికిత్స పొందుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధి తీవ్రత పెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

జిల్లాలో ఇద్దరు బాధితులు
జిల్లాకు చెందిన ఇద్దరికి ఇప్పటికే వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కైకలూరుకు నియోజకవర్గం పాతవరపాడు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెల్లూరులోని క్యాన్సర్‌ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లగా.. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన సాంబశివరావుకు తలనొప్పి, జ్వరం సోకడంతో వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ ఫ్లూ వ్యాపించడంతో పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

ఏడాది అనంతరం పంజా
జిల్లాలో స్వైన్‌ ఫ్లూ ఏడాది అనంతరం మళ్లీ పంజా విసురుతోంది. గతేడాది మూడు మాసాల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో స్వైన్‌ ఫ్లూ కేసులను బహిర్గం చేయడంలో వైద్యాధికారులు గోప్యత పాటించినట్లు తెలిసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సోకిన రెండు రోజుల వ్యవధిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది.

 లక్షణాలు ఇవీ...
స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి చీదినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా(గాలి ద్వారా) ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులకు త్వరగా వ్యాపిస్తుంది.
అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం, పెదాలు నీలి రంగులోకి మారడం, కఫం ద్వారా రక్తం పడటం లాంటి లక్షణాలు ఉంటాయి.
దగ్గు, గొంతు తడారిపోవడం, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, వణుకుట తదితర లక్షణాలు ఉంటాయి.

 జాగ్రత్తలు ఇలా..
దగ్గినా, చీదినా ముక్కుకు అడ్డంగా గుడ్డ పెట్టుకోవాలి.
చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి.
ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సంచరించకూడదు.
నీళ్లు బాగా తాగాలి. మంచి పోషాకాహారాన్ని తీసుకోవాలి.

ఏం చేయకూడదంటే..
ఎవరినైనా కలిసినప్పుడు కరచాలనం, కౌగిలించుకోవడం వంటి పనులకు దూరంగా ఉండాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు.
వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే మందులు వాడాలి.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం
స్వైన్‌ ఫ్లూ నుంచి ప్రజలను రక్షించేందుకు అవరసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని పీహెచ్‌సీల వైద్య సిబ్బందని అప్రమత్తం చేశాం. వ్యాధి ఎలా వ్యాపిస్తుందన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్‌ పోస్టర్లు, వైద్య సిబ్బంది సైతం గ్రామాలకు వెళ్లి వివరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
–ఎ.నాగేశ్వరరావు,అంటువ్యాధుల వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు