అభిమాన తరంగం

18 Sep, 2014 01:42 IST|Sakshi
అభిమాన తరంగం
  • ఘనంగా టీఎస్సార్ జన్మదిన వేడుకలు
  • సిరిపురం: కళాకారులు, సినీరంగ ప్రముఖులు, పండితులు, విద్వాంసులు, రాజకీయ నాయకులు, అభిమానుల నడుమ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. టీఎస్సార్ లలితా కళాపరిషత్ పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకల్లో హేమాహేమీలంతా పాల్గొని టీఎస్సార్‌ను గజమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

    సర్వధర్మ సమ్మేళానికి నిదర్శనంగా క్రీస్తు, సిక్కు, ముస్లిం, హిందూ మత గురువులతో కలిసి టీఎస్సార్ దండాలను ధరించి అందరూ సమానమే అంటూ తెలియచెప్పారు. వారందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా టీఎస్సార్ తల్లిదండ్రులు బాబురెడ్డి, రుక్మిణమ్మల తైలవర్ణ చిత్ర పటంతోపాటు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

    ఈ సభలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా విశాఖ ప్రజల మధ్యే పుట్టిన రోజును జరుపుకుంటున్నానని, ఈ సందర్భంగా కళాకారులను సత్కరించడం ఆనందంగా భావిస్తానన్నారు. అంతేకాదు పేదలకు సాయం చేయడంతోపాటు విశాఖ ప్రజలకు దైవాశీస్సులు కలగాలని కోరుతూ దైవారాధకుల్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు.తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనప్పటికీ రాజకీయాలకతీతంగా సేవ చేయాలన్నదే తన సిద్ధాంతమన్నారు. రెండేళ్లలో బాలసుబ్రమణ్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను మనమే జరుపుకుంటామని టీఎస్సార్ తెలిపారు.
     
    తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంటారని, ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తన సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఒక్క టీఎస్సార్‌కే దక్కుతుందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ పి.జె.కురియన్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఎంతో గౌరవంగా, హుందాగా టీఎస్సార్ మెలుగుతారన్నారు. 18 ఏళ్లుగా ఇద్దరం పార్లమెంట్లో మంచి మిత్రులమని, టీఎస్సార్ నాలుగోసారి కూడా రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు.

    రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ పుట్టిన రోజునాడు కళాకారులను సత్కరించి నిజమైన కళాబంధుగా నిలిచారన్నారు. జన్మదినంనాడు ప్రముఖ సంగీత గాయకుడు కె.జె.ఏసుదాసును విశాఖవాసుల మధ్య సన్మానించడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న పుణ్యమన్నారు. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రజల మధ్య ఘనంగా పుట్టిన రోజు గడుపుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీఎస్సార్ తప్ప మరెవ్వరూ కాదన్నారు. హరిహరాసనం అనే పాటను వింటే చాలు టక్కున గుర్తుచ్చేది కె.జె.ఏసుదాసేనని తెలిపారు.
     
    ఎంపీ కె.వి.పి.రామచందర్రావు, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్, మాజీ ఎంపిలు ఎంవీవీఎస్ మూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జమునారాణి, ఎల్ ఆర్ ఈశ్వరి, సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రముఖ నటి పూర్ణిమ, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
     
    రాష్ట్రపతి శుభాకాంక్షలు

    రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుబ్బరామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ పంపారు. పుట్టిన రోజు సందర్భంగా ఆ లేఖలోని సారాంశాన్ని అభిమానలుందరికీ చదివి వినిపించారు.

     ఏసుదాస్‌కు విశ్వవిఖ్యాత సంగీతకళానిధి బిరుదు

    భారతదేశం గర్వించదగ్గ గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ‘విశ్వవిఖ్యాత సంగీత కళానిధి’ బిరుదును గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. స్వర్ణ బంగారు కంకణాన్ని రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ తొడిగారు.  మోన్‌బాబు గదను బహూకరించగా, చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం కె.జె.ఏసుదాస్ , ఎస్.పి బాలసుబ్రమణ్యం పాటలు ప్రేక్షకులను మైమరపించాయి. అంతకుముందు సాలూరి వాసూరావు బృందం పాడిన భక్తిగీతాలు ప్రేక్షకులను అలరించాయి.
     

మరిన్ని వార్తలు