క‘న్నీటి’ కుళాయి!

15 Jan, 2016 01:46 IST|Sakshi

పబ్లిక్ కుళాయిలకు త్వరలో మంగళం
వ్యక్తిగత కుళాయి కనెక్షన్ తప్పనిసరి
సామాన్యులకు పెను భారం
{పజల నెత్తిన రూ.30 కోట్ల భారం {పతి నెలా పన్నుపోటు

 
 
స్మార్ట్ మంత్రం సంక్షేమాన్ని మాయం చేస్తోంది. ప్రజోపయోగ సేవలకు మంగళం పాడేస్తోంది. విశాఖ మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తామని చెబుతున్న పాలకులు.. అభివృద్ధి మాటేమోగానీ.. ఉన్న సౌకర్యాలను ఊడగొడుతూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. వ్యక్తిగత కుళాయిలను తప్పనిసరి చేయాలన్న జీవీఎంసీ ్డనిర్ణయం అటువంటిదే. దీనివల్ల నగరంలోని లక్షలాది కుటుంబాలు తాగునీరు గగనమవుతుంది.
 
 సాక్షి, విశాఖపట్నం :
 వ్యక్తిగత కుళాయిల పేరుతోసామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపేందుకు జీవీఎంసీ(మహావిశాఖ నగరపాలక సంస్థ) రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు ట్యాంకర్లు, పబ్లిక్ కుళాయిలపై ఆధారపడుతున్న సామాన్య ప్రజలు గొంతు తడుపుకోవడానికి కాసులు వెచ్చించక తప్పదు. విలీన మున్సిపాల్టీలు, పంచాయతీలు కలుపుకొని జీవీఎంసీ పరిధిలో 22 లక్షల జనాభా ఉంది. జనాభా లెక్కల ప్రకారం ఐదున్నర లక్షల కుటుంబాలు ఉండగా.. ఆస్తి పన్ను రికార్డుల ప్రకారం 4.22 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.60 లక్షల ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 4వేల అపార్ట్‌మెంట్లకు సెమీ బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. నగర పరిధిలో 7,500 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. వీటిపై ఆధారపడుతున్న కుటుంబాలు 2.50 లక్షల వరకు ఉంటాయని అంచనా. వ్యక్తిగత కనెక్షన్లు తప్పనిసరి చేస్తే వీరంతా కుళాయిలు వేయించుకోవాల్సిందే.
 సామాన్యులకు ఆర్థిక భారం
 కుళాయి కనెక్షన్ వేయించుకోవాలంటే ఇన్‌స్టలేషన్ చార్జీల కింద బీపీఎల్ కుటుంబాలకు రూ. 1200, ఏపీఎల్ కుటుంబాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ ఖర్చులను పూర్తిగా ఎవరికి వారే భరించాలి. ప్రధాన పైపులైన్‌కు ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మెటీరియల్ ఖర్చు వస్తుంది. పబ్లిక్ కుళాయి వినియోగించుకుంటున్న కుటుంబాలు లక్షకుపైగా ఉంటే..వారిలో సొంత ఇళ్లు ఉన్న వారు 70వేలకుపైగా ఉంటారని అంచనా. ఇక వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు కలిగిన వారిని మినహాయిస్తే ఆస్తిపన్ను అసెస్‌మెంట్ ప్రకారం మరో 2 లక్షల ఇళ్ల యజమానులు వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. వీరిలో లక్షన్నరకు పైగా బీపీఎల్ పరిధిలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ లెక్కన సరాసరిన 2లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు విధిగా వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు వేయించుకోవల్సిన పరి స్థితి ఏర్పడింది. వీరు కనెక్షన్‌కు రూ.1200 చొప్పున చెల్లించడంతో పాటు మరో రూ.వెయ్యికి పైగా మెటీరియల్ చార్జి కింద భరించాలి. అంటే మొత్తం 2లక్షల బీపీఎల్ కుటుంబాలపై ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.30 కోట్ల మేర భారం పడనుంది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.60 చొప్పున కుళాయి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం ఏటా కోటిన్నర పైమాటే. ఇక ఇన్‌స్టలేషన్, మెటిరీయల్ చార్జీలు కలిపి ఏపీఎల్ కుటుంబాలపై రూ.10 కోట్ల వరకు భారం పడనుండగా. వీరు ప్రతి నెలా రూ.120 చొప్పున పన్నుల రూపంలో రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
 శివార ప్రాంతాల పరిస్థితి దారుణం
 పబ్లిక్ కుళాయి కనెక్షన్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో విధిగా ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ వేయాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన ‘అవృత్’ నిధులు రూ.130 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా జీవీఎంసీలో విలీనమైన శివారు గ్రామాల కు నేటికీనగర మంచినీటి పథకంతో కనెక్టవిటీ లేదు.
 వాటర్‌ట్యాంక్‌ల ద్వారానే ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది,పెందుర్తి, చినముషిడివాడ, అడవివరం, సింహాచలం దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు 4 ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ గ్రామాలకు ఒకపూట నీరు రావడం కూడా కష్టంగా ఉంది. వేసవిలో అయితే వీరి పాట్లు వర్ణనాతీతం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయా గ్రామాలకు అవృత్ పథకం నిధులతో పూర్తి స్థాయిలో పైపులైన్లు వేయాలని నిర్ణయించారు.
  వ్యక్తిగత కుళాయిల ఏర్పాటు పూర్తి కాగానే పబ్లిక్ కుళాయిలను తొలగించాలని భావిస్తున్నారు. 2017 నాటికి నగరంలో ఎక్కడా పబ్లిక కుళాయినేది కన్పించని పరిస్థితి ఏర్పడనుంది.
 

మరిన్ని వార్తలు