మద్యరహిత రాష్ట్రమే లక్ష్యం

5 Oct, 2019 12:57 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ డైరెక్టర్‌ హరికుమార్‌

గతంలో కంటే మద్యం షాపులు గణనీయంగా తగ్గించాం

నాటు సారాను అరికట్టేందుకు గ్రామ వలంటీర్ల సహకారం తీసుకుంటాం

ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ డైరక్టర్‌ హరికుమార్‌ వెల్లడి

తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం : మద్యం రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పి. హరికుమార్‌ వెల్లడించారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం నిషేధం దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నాలుగు వేలకు పైగా మద్యం షాపులు లైసెన్స్‌లు ఇస్తే ప్రస్తుతం 3,500 మద్యం షాపులు ఇచ్చామని, 20 శాతం తగ్గించామని తెలిపారు. నాటు సారా అరికట్టేందుకు 15 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం లంక గ్రామాల్లో దాడులు నిర్వహించి 2,300 లీటర్ల బెల్లం ఊటను, 150 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

నాటు సారా తయారీ, అమ్మకాలు, రవాణా నిర్వహించే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నాటు సారా తయారీ చేసే గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా 93 మండలాల్లో 210 గుర్తించామని తెలిపారు. నాటు సారా అరికట్టేందుకు రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని తెలిపారు. 16 కొత్త వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న నాటు సారాను అరికట్టేందుకు పోలీసులు,  గ్రామవలంటీర్ల సహకారం తీసుకుంటామన్నారు. నాటు సారా తయారీ చేసే వారు, తయారీ చేసేందుకు భూమి ఇచ్చిన యజమాని పైనా పీడీ యాక్ట్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలు, తూర్పుగోదావరి, యానాం లంక గ్రామాల్లోని తోటలు, భూముల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని వివరించారు. సారాను అరికట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లోని ప్రజల సహకారంతో సారా అరికడతామన్నారు. 

ఈ ఏడాదిలో 30 గంజాయి కేసులు
విశాఖ జిల్లా పెద్దబైయలు, జి.కె. వీధి, హుక్కుంపేట, జి. మాడుగల తదితర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది 30 గంజాయి కేసులు నమోదు చేసి ఆరు వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 125 వాహనాలు సీజ్‌  చేసినట్టు  తెలిపారు. ఆరు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి 50 శాతం గంజాయి అక్రమ రవాణాను అరికట్టామని అన్నారు. ఒడిశా రాష్ట్రం సహకారంతో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి పంటలు, రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254868కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.జయరాజు, సూపరింటెండెంట్‌ కె.వి.ప్రభుకుమార్, యు.శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా