కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

19 Jun, 2014 03:29 IST|Sakshi
కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

 సంతమాగులూరు : మండలంలోని కామేపల్లి, తంగేడుమల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులకు తెగబడ్డారు. కామేపల్లిలో మంగళవారం సాయంత్రం గుండపనేని మోహన్‌రావు అనే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తపై ఆదే గ్రామానికి చెందిన కొల్లూరి శ్రీను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తంగేడుమల్లిలో బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ అతని సోదరుడు నాగరాజుపై ఆదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలతో ఆ రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
 తంగేడుమల్లిలో..
 తంగేడుమల్లి సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ ద్విచక్ర వాహనాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య తన ద్విచక్ర వాహనంతో రెండు రోజుల క్రితం ఢీకొట్టించాడు. ఆ విషయం అప్పటితో సమసిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి వచ్చిన శేషయ్య తేల్చుకుందాం రమ్మంటూ బొడ్రాయి సెంటర్‌కు ధూళిపాళ్ల మురళీకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు.
 
 మురళీకృష్ణ బొడ్రాయి వద్దకు వెళ్లగానే శేషయ్య తిట్ల పురాణం అందుకున్నాడు. మురళీకృష్ణ నిలువరించబోగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. మురళీకృష్ణ తమ్ముడు నాగేశ్వరరావు పరుగున వచ్చి అడ్డుకోబోగా అతని చేతి వేళ్లకు కత్తి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు.
 
 కామేపల్లిలో..
 బాధితుల కథనం ప్రకారం మండలంలోని కామేపల్లిలో గుండపనేని మోహన్‌రావు, టీడీపీ కార్యకర్త కొల్లూరి శ్రీనుకు మధ్య పొలం వద్ద ముళ్ల కంచె వేసే విషయంలో వివాదం చెలరేగింది. ముళ్లకంచె వేసేందుకు అభ్యంతరం తెలిపిన మోహన్‌రావుపై కొల్లూరి శ్రీను తన చేతిలో ఉన్న కత్తి విసరడంతో మోహన్‌రావుకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు.
 
 మురళీకృష్ణ నుంచి వాంగ్మూలం
 నరసరావుపేట వెస్ట్: మురళీకృష్ణ నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ వన్‌టౌన్ పోలీసులకు తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

మరిన్ని వార్తలు