దొంగచాటు.. చార్జీల పోటు

29 Mar, 2019 14:39 IST|Sakshi

సేఫ్టీ, సౌకర్యాల పేరిట వడ్డింపులు   

చిల్లర సమస్య అంటూ ఆర్టీసీ ప్రయాణికులపై మోత

సామాన్యులపై తెలియకుండానే భారం 

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): చంద్రబాబు పాలన అంతా దోపిడీనే. ప్రజలపై భారాలను మోపనంటూనే పరోక్షంగా చార్జీల మోతను మోగించారు. సంక్షేమ పథకాలు, హామీల్లో మోసం చేసినట్లే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ బాబు తన మోసపూరిత వైఖరిని చూపించారు. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీ చార్జీలు పెంచనంటూనే ఒక్కసారి పెంచారు. సేఫ్టీ, సౌకర్యాలు తదితరాల పేరిట అడ్డూ అదుపులేకుండా చార్జీల రేట్లు పెరిగిపోవడం ఇందుకు నిదర్శనం. డీజల్‌ ధరలు పెరిగినా ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గతాన్ని మరిచిపోయి గొప్పులు చెప్పుకునే బాబు చాప కిందనీరులా ప్రయాణీకులపై దోపిడీ పర్వానికి తెరతీశారు. 

ఐదేళ్ల పాలనలో ఒక్కసారి ఆర్టీసీ చార్జీలను 10 శాతానికి పెంచారు. 2015 అక్టోబర్‌ 28న అధికార పూర్వకంగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆ తర్వాత నేరుగా బస్సు చార్జీలను పెంచకుండా పరోక్ష రూపంలో వడ్డించడం ప్రారంభించారు. ఇందుకు ప్రయాణికుల సౌకర్యాల కల్పన అనే ముద్దు పేరుతో 2016లో టికెట్‌పై రూ.2 పెంచారు. అనంతరం 2017లో అమరావతి నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో భద్రత (సేఫ్టీ) సెస్‌ పేరిట ఒక్క రూపాయి,  స్వచ్ఛభారత్‌ పేరుతో మరో రూపాయి వంతున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

ఇదిగాక గతంలో ఉన్న టోల్‌ చార్జీలను అదనంగా పెంచి వసూలు చేయడం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాల పేరుతో టికెట్‌పై రూ.2 వసూలు చేస్తున్నా కల్పిస్తున్న సౌకర్యాలు ఏమీ లేవు. గతంలో ఆర్డనరీలో ఒక టోల్‌ గేట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌లో రూ.3 వసూలు చేసేవారు. ఈ టోల్‌ చార్జీలు అప్పటికి.. ఇప్పటికీ పెరగకపోయినా ఇప్పుడు రూ.10 వంతున టోల్‌ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇక లాంగ్‌ సర్వీసుల్లో అయితే ప్రతి టోల్‌ గేటుకు రూ.6 వంతున వసూలు చేస్తున్నారు.

జిల్లాలోని పది డిపోల్లో 4 అమరావతి బస్సులు, గరుడ, ఇంద్ర, 12 అల్ట్రా డీలక్స్‌లు, 102 సూపర్‌లగ్జరీ, 220 ఎక్స్‌ప్రెస్, 487 తెలుగు వెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి  రోజుకు 3.15 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తున్నాయి. 4 లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. రోజుకు సగటున అదనపు చార్జీల రూపంలో రూ.96 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థలో ఖాతాలోకి వెళుతున్నాయి.


సౌకర్యాల కల్పన పేరిట 
సౌకర్యాల కల్పన పేరిట 2016లో టికెట్‌పై రూ. 2 పెంచారు. దీని ద్వారా జిల్లాలో సుమారు 8 లక్షలు అదనంగా ప్రజలపై భారం మోపారు. టికెట్‌ రేటు పెంచకుండానే ప్రయాణికులపై పడిన అదనపు భారంతో ప్రజలు బాబు మోసాన్ని గుర్తించడానికి చాలా కాలం పట్టింది. 2017 సెప్టెంబర్‌ నుంచి డీలక్స్‌ ఆపై కేటగిరీ బస్సు సర్వీసుల్లో సెస్‌ పేరిట ఒక్కో టికెట్‌పై రూపాయి వసూలు చేస్తోంది. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సైతం సెస్‌ వసూళ్లకు పాల్పడుతోది. జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ ఆపై కేటగిరీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సుల్లో టికెట్‌ ధరతో పాటు భద్రత సెస్‌ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన  3 లక్షల ప్రయాణికుల వద నుంచి ఆర్టీసీ రోజుకు రూ.3 లక్షలు  అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు టోల్‌ చార్జీల పేరిట దోపిడీ కొనసాగుతూనే ఉంది. వీటితో పాటు పండగలు వచ్చినప్పుడు చార్జీలు ఏ రేంజ్‌లో పెరుగుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 


పేరుకే సౌకర్యాలు 
కిలో మీటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడి వద్ద నుంచి భద్రత సెస్‌ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. అయితే  ప్రయాణికుల భద్రతకు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్‌లు కూడా అందుబాటులో ఉండటంలేదు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల భద్రత ఏ పాటిదో ఇట్టే అవగతమవుతోంది. మొత్తం మీద ప్రయాణికుడే లక్ష్యంగా దోపిడీ చేస్తోంది.  


సవరణ పేరుతో బాదుడు 
ఒక వైపు ఆర్టీసీలో క్యాట్, వనిత, సీనియర్‌ సిటిజన్‌ వంటి రాయితీలకు మంగళం పాడిన సంస్థ, బస్సుల్లో చార్జీల çసవరణ పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లర సమస్యలు రాకుడదనే టికెట్‌ ధరల్లో సవరణలు చేశామని ప్రకటించినప్పటికీ ఆ పేరిట దోపిడీకి శ్రీకారం చుట్టారు. సవరించిన చార్జీలు ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో తొలుత అమలులోకి తీసుకువచ్చి ఆపై దానిని తెలుగువెలుగు బస్సులకు సైతం వర్తించేలా చేశారు. వీటి ద్వారా వచ్చే మొత్తం యాజమాన్యం ఖాతాలోకి చేరుతోంది. తెలుగువెలుగు బస్సులో ఓ గ్రామానికి వెళ్లేందుకు గతంలో రూ.12 వసూలు చేయగా సవరణ అనంతరం రూ.15కు పెంచారు. ఈ లెక్కన జిల్లాలో ప్రయాణికులపై సవరణల పేరుతో అదనంగా రూ.20 నుంచి రూ.30 లక్షలు అదనపు భారం పడింది. ఆర్టీసీలో ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌లను బట్టి టికెట్‌ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ ప్రజలను దోచుకోవడంలో  బాబు ప్రభుత్వంలో జరిగినన్ని అక్రమాలు మరెప్పుడు జరగలేదని ప్రజలు వాపోతున్నారు.    

డబుల్‌ చార్జీలు పెరిగాయి 
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు డబుల్‌ పెరిగాయి.  గతంలో సంగం నుంచి నెల్లూరుకు రూ.25 ఉంటే.. ఇప్పుడు రూ.35 వసూలు చేస్తున్నారు.  ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం సురక్షితమైందని, విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెరిగినా బస్సులోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి.  
–  ఇండ్ల మణి, గాంధీజనసంఘం, సంగం మండలం 
 
టోల్‌ చార్జీల బాదుడు మరీ ఎక్కువ 
ఆర్టీసీ చార్జీల బాదుడు భరించలేని విధంగా ఉంది. ఆత్మకూరు నుంచి నెల్లూరుకు గతంలో అర్డనరీలో రూ.35 ఉంటే.. ఇప్పుడు టోల్‌ చార్జీ కింద రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. మాకు డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత బస్సు చార్జీలతో ప్రతి టోల్‌గేట్‌కు పది రూపాయల మేర పెంచేశారు.   
–  రేవూరు పెంచల రెడ్డి, వెన్నవాడ, ఆత్మకూరు మండలం

ఆర్టీసీ బస్సుల్లో దోపిడీ 
బస్‌ చార్జీలు ఇష్టానుసారంగా పెరిగిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో సామాన్య ప్రజలు ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. దొరవారిసత్రం నుంచి సూళ్లూరుపేటకు రూ.25, నాయుపేటకు రూ.20 టికెట్ల ధరలు ఉన్నాయి. దగ్గరగా ఉన్న సూళ్లూరుపేటకు టికెట్‌ రూ.15 అయినా.. టోల్‌గేట్‌ చార్జీ రూ.10 వంతున పెరిగి భారం పడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో కంటే ప్యాసింజర్‌ రైళ్లను నమ్ముకుని తిరుగుతున్నాము. 
– దేవళ్ల సుధాకర్, ఏకొల్లు, దొరవారిసత్రం మండలం


బస్సు చార్జీలు భారం
బస్సు చార్జీలు పెరిగిపోయాయి. బస్సు ఎక్కాలంటే భయమేస్తోంది. ఓజిలి నుంచి  నాయుడుపేటకు గతంలో రూ.15 ఉంటే.. ఇప్పుడు రూ.20  చేశారు. గూడూరుకు అయితే గతంలో రూ.30 ఉంటే.. ఇప్పుడు రూ.45 అయింది. ఇక నెల్లూరుకు అయితే గతంలో రూ.50 ఉంటే.. మధ్యలో రెండు టోల్‌గేట్ల చార్జీలతో కలుపుకుని రూ.75 వసూలు చేస్తున్నారు.  
–  శ్రీనివాసులు ఓజిలి
  


టికెట్‌ దోపిడీ తీరు చూద్దాం..

కావలి నుంచి నెల్లూరు 
ఆర్డనరీ టికెట్‌ ధర      : రూ.35
టోల్‌ చార్జీ        : రూ.10

ఎక్స్‌ప్రెస్‌  టికెట్‌ ధర    : రూ.46
టోల్‌ చార్జీ        : రూ.10
సెస్‌ చార్జీలు    అన్నీ    : రూ.4 

మరిన్ని వార్తలు