అన్న క్యాంటీన్లలో కమీషన్ల భోజనం

1 Sep, 2019 05:00 IST|Sakshi

ప్రతి అంగుళంలోనూ అవినీతే.. టీడీపీ సర్కారు పాలనలో భారీ దోపిడీ 

రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ

సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘అన్న క్యాంటీన్ల’ పేరిట ఖజానాకు సున్నం పెట్టారు. పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామంటూ ఇష్టారాజ్యంగా కమీషన్లు భోంచేశారు. ఈ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని నిజాలను చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, ముఖ్య పట్టణాల్లో 203 అన్న క్యాంటీన్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు భారీ ఎత్తున దోచేశారు. 203 క్యాంటీన్ల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.76.22 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏకంగా రూ.53.33 కోట్లు పక్కదారి పట్టినట్లు నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. క్యాంటీన్ల నిర్మాణంలో రూ.35.11 కోట్లు, అందులో హంగుల పేరిట రూ.18.22 కోట్లు కాజేసినట్లు గుర్తించింది. అన్న క్యాంటీన్ల నిర్మాణాల్లో ప్రతి అంగుళంలోనూ అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. 

వ్యయం పెంచెయ్‌..  ముంచెయ్‌ 
నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. చదరపు అడుగుకు రూ.2,100 చొప్పున రూ.17.30 లక్షలతో ఒక్కో అన్న క్యాంటీన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.4,585కు పెంచేశారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణ వ్యయం రూ.37.55 లక్షలకు పెరిగింది. అన్ని క్యాంటీన్ల విషయంలో కేవలం నిర్మాణాల్లోనే రూ.35.11 కోట్లు అదనంగా చెల్లించారు. అలాగే షోకుల కోసం ఒక్కో క్యాంటీన్‌కు రూ.8.98 లక్షలు వెచ్చించారు. మొత్తం 203 క్యాంటీన్లలో హంగు, ఆర్భాటాలకు రూ.18.22 కోట్లు ఖర్చయ్యిందని లెక్కలు చూపారు. వాస్తవానికి క్యాంటీన్లలో అదనపు పనులేవీ జరగలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అంటే ఈ సొమ్మంతా టీడీపీ నేతలు, అప్పటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

రికార్డుల్లో అంతా గోల్‌మాల్‌ 
అన్న క్యాంటీన్ల నిర్మాణానికి ఎం30 గ్రేడ్‌ కాంక్రీట్‌ ఉపయోగించినట్లు రికార్డుల్లో చూపారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణ వ్యయం రూ.7 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఎం20 గ్రేడ్‌ కాంక్రీట్‌ మాత్రమే వినియోగించారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అన్న క్యాంటీన్ల ప్లాస్టరింగ్‌ సాధారణంగా ఒక మిల్లీమీటర్‌ నుంచి రెండు మిల్లీమీటర్ల మందంతో వేస్తారు. కానీ, మూడు మిల్లీమీటర్ల మందంతో వేసినట్లు చూపించి ఒక్కో క్యాంటీన్‌లో రూ.40 వేల చొప్పున మింగేశారు. ఫౌండేషన్, బేస్‌మెంట్‌లో ఇసుక నింపినట్లు రికార్డుల్లో చూపి, ఒక్కో క్యాంటీన్‌లో అదనంగా రూ.2.10 లక్షలు కొల్లగొట్టారు. మూడు కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తెచ్చామంటూ ఒక్కో క్యాంటీన్‌లో అదనంగా రూ.20 వేలు, చదరపు అడుగుకు 5 టన్నుల సామర్థ్యంతో పునాది వేశామంటూ ఒక్కో క్యాంటీన్‌లో రూ.60 వేల చొప్పున తినేశారని నిపుణుల కమిటీ వెల్లడించింది. 

టెండర్లలో పాల్గొన్నది రెండు సంస్థలే 
ఒక్కో క్యాంటీన్‌పై అన్న క్యాంటీన్‌ అని పేరు రాయడానికి రూ.1.54 లక్షలు, ఒక్కో క్యాంటీన్‌ లోపల షోకుల కోసం రూ.3.40 లక్షలు, అన్న క్యాంటీన్‌ రాత్రిపూట కూడా కనిపించేలా చేయడానికి విద్యుత్‌ వెలుగులకు రూ.2.90 లక్షలు, క్యాంటీన్‌ బయట డెకరేషన్‌కు రూ.0.74 లక్షలు వ్యయం చేసినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. అన్న క్యాంటీన్ల టెండర్లను ఎవరికి కట్టబెట్టాలో నిర్ణయించుకున్న తర్వాతే టెండర్‌ నిబంధనలు రూపొందించారని, ఈ టెండర్లలో పాల్గొనేందుకు అనుభవం గల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించలేదని స్పష్టం చేసింది. రెండు దశల్లో చేపట్టిన అన్న క్యాంటీన్ల టెండర్లలో రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి చేసిన వ్యయం చాలా అధికంగా ఉందని వెల్లడించింది. వాస్తవానికి అంత ఖర్చు కాదని, ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.  

మరిన్ని వార్తలు