చంద్రబాబు దృష్టికి కీలక నేత నిర్వాకం !

26 Apr, 2015 03:16 IST|Sakshi

ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులు
 నాయకత్వం వహించేందుకు ముందుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే
 బాధితులందర్నీ కూడగడుతున్న వైనం
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాలోని టీడీపీ కీలక నేత బాధితులంతా అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పదవులిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ నేరుగా అధినేత దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కీలక నేత బాధితులందర్నీ ఓ మాజీ ఎమ్మెల్యే  ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులిచ్చినా, ఇవ్వకపోయినా ఆ కీలక నేతకు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వొద్దని చంద్రబాబును కోరేందుకు కంకణం కట్టుకుంటున్నారు.
 
  ఎన్నికలకు ముందు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పిస్తానని కొందరి నుంచి, ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని మరికొందరి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేయగా, ఎన్నికలయ్యాక ఎంపీపీ, కో ఆప్షన్ పదవులిప్పిస్తానంటూ దండుకున్నారని, అంతటితో ఆగకుండా తానొక పదవిని ఆశిస్తూ మరో మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించేలా తనవంతు కృషి చేస్తానంటూ లక్షలాది రూపాయలు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.
 
  అలా సొమ్ము ముట్టజెప్పిన వారిలో కొందరికి అవకాశాలు దక్కగా, మరికొందరికి దక్కలేదు. పదవులు దక్కిన వారికి కూడా వారి సామర్థ్యం మేరకే తప్ప ఆ కీలక నేత గొప్పతనమేదీ లేదు. దీంతో గుర్రుగా ఉన్న పార్టీ నేతలు ఒకరిద్దరు ఇప్పటికే పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న నేతల దృష్టికి తీసుకెళ్లగా, మరికొందరు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా?  ఆయన గారి భాగోతం చంద్రబాబు దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లాలా? అని ఎదురు చూస్తున్నారు. కాకపోతే, అధినేత వద్దకు వెళ్లేంత చనువు ఉన్న నాయకుడు చొరవ చూపడం లేదని ఇంతకాలం వేచి చూశారు.
 
  ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి వచ్చేందుకు దోహదపడతారని నమ్మి లక్షలు ముట్టజెప్పిన మాజీ ఎమ్మెల్యే ఒకరు  కీలక నేత బాధితులందరికీ నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడా నేత బాధితులు ఎక్కడెక్కడున్నారో తెలుసుకుని, వారి మోసపోయిన తీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.   వారందర్నీ కూడగట్టి,  వారి గోడును పేపరుపై పెట్టి కీలక నేత నిర్వాకాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలా ఎంతమందిని మోసగిస్తాడని...ఎక్కడో ఒకచోట చెక్ పెట్టకపోతే అధిష్టానం కూడా నమ్మి మోసపోతుందనే అభిప్రాయంతో ఉన్నారు. తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న ఆ కీలక నేతకు పొరపాటున పదవి లభిస్తే అడ్డగోలుగా దున్నేయడం ఖాయమనే అభద్రతా భావంతో ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు