దీపాలార్పేస్తున్న తెలుగు తమ్ముడు

29 Mar, 2018 13:48 IST|Sakshi

మొన్న శ్రీరాంపురంలోని ఆలయానికి తాళాలు వేసిరామ కల్యాణాన్ని నిలిపేసిన నేత

ఇప్పుడు గ్రామంలో మిగిలిన ఆలయాల్లో పూజలు చేయరాదంటూ రాద్ధాంతం

ఏకంగా ఆలయాలకు తాళాలు వేసిన వైనం...

జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

అరాచకాలను బహిర్గతం చేసిన ‘సాక్షి’

పిఠాపురం: ‘దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే’ అనేది నానుడి ... కానీ ఈ ఊళ్లోని రాముడి పెళ్లికి మాత్రం నేనే పెద్దనని ఓ టీడీపీ నేత హంగామా చేయడం పలువురిని విస్మయపరుస్తోంది. గ్రామమంతా నచ్చజెప్పినా ‘ససేమిరా’ అంటూ మొండికేయడం విస్తుబోయేలా చేస్తోంది. పిచ్చి ముదిరి రోకలిని మోకాలికి చుట్టుకుంటానన్న చందంగా బుధవారం మరింత ముందుకు వెళ్లి ఒక్క రాముడి వివాహమే కాదు గ్రామంలో ఏ దేవాలయంలోనూ పూజలు చేయనిచ్చేది లేదని ఘర్షణలకు దిగడంతో గ్రామస్తులంతా ఒక్కటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... రాముడి పేరుతో వెలిసిన శ్రీరాంపురం గ్రామంలో సాక్షాత్తు శ్రీరాముల కల్యాణాన్ని సోమవారం నిలిపివేసి ఆలయానికి  తాళాలు వేసిన టీడీపీ ఎంపీపీ భర్త పిర్ల గంగాధర్‌ మరో అపచారానికి పాల్పడ్డాడు.

రాముల వారి ఆలయానికి తాళాలు వేయడంతో ఆ నేత కోపం తీరలేదో ఏమో ఊళ్లో ఉన్న అన్ని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలు జరపరాదంటూ తాళాలు వేశాడు. చివరికి గ్రామ దేవత ఆలయానికి సైతం తాళాలు వేసిన ఆ నేత గ్రామం నడిబొడ్డున ఉన్న రామాంజనేయ విగ్రహం వద్ద జైగంట కూడా ఎవరూ కొట్టరాదని హుకుం జారీ చేస్తూ ఆ గంటను పీకించేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలకు తాళాలు వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన గ్రామస్తులు తిరగబడడంతో కాస్తా వెనక్కితగ్గి  గ్రామ దేవత ఆలయం తాళాలు తీయించడానికి అంగీకరించాడు. అయితే భక్తులు ఎటువంటి పూజలు చేయరాదని భీష్మించడంతో గ్రామస్తులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచి భర్త నాగళ్ల వెంకటరమణ తెలిపారు.

‘సాక్షి’పై చిందులు...
సీతారామ కల్యాణాన్ని నిలిపివేయించి ఆలయానికి తాళాలు వేసిన సంఘటనపై ‘రామ రామ’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 27వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో ఆ ఎంపీపీ భర్త ‘సాక్షి’పై చిందులు తొక్కాడు. తనపైనే వ్యతిరేకంగా వార్తలు రాస్తారా...వారి అంతు చూస్తానంటూ హెచ్చరించడం గమనార్హం. తనపంతం నెగ్గే వరకు గ్రామంలో ఏ దేవుడికీ పూజలు జరగవని...ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటే సవాల్‌ విసిరాడు. జరిగిన ఘటనలు వార్తలుగా రాస్తుంటే ఇలా హెచ్చరించడం సమంజసంగా లేదని గ్రామస్తులు ‘సాక్షి’కి బాసటగా నిలిచారు.

మరిన్ని వార్తలు