అవినీతికి అభివృద్ధి ముసుగు

5 Apr, 2019 12:46 IST|Sakshi
ఒంగోలులో డివైడర్ల మధ్య ఉన్న ప్రకటనల బోర్డులు

అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే దామచర్ల, నాటి కమిషనర్‌ సంక్రాంతి

నిబంధనలు తుంగలో తొక్కిన టౌన్‌ ప్లానింగ్, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు

‘ఒంగోలు నగరాన్ని నేనే అభివృద్ధి చేశా...’ అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తరచూ డబ్బాలు కొట్టుకుంటుంటారు. కానీ ఉన్న డివైడర్లను కాస్తంత పొడిగించి, పార్కులకు రంగులేసి..ఇదే అభివృద్ధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. పనిలోపని అభివృద్ధి పేరు చెప్పుకొని భారీగా అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు కోట్ల రూపాయలు దండుకుని నగర పాలక సంస్థ ఖజానాకు గండికొట్టారు.

సాక్షి, ఒంగోలు అర్బన్‌: వందల కోట్లు కేటాయించి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశామని బాజాలు కొట్టుకుంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అభివృద్ధి మాటున కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు అండగా నాటి కమిషనర్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు చేతులు కలపడంతో అవినీతికి అభివృద్ధి ముసుగు వేసి నగరపాలక ఖజానాకు చేరవలసిన సొమ్మును తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పంచుకున్నారు. నగరంలో బ్యూటిఫికేషన్‌ పేరుతో ప్రధాన రహదారుల్లోని సెంటర్‌ డివైడర్లలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ ప్రకటనలు వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువుకు సంబంధించిన ప్రైవేటు ఏజెన్సీకి నిబంధనలకు విరుద్ధంగా సెంటర్‌ డివైడర్లను అప్పగించారు.

బూట్‌ (బిల్ట్‌ ఆపరేటివ్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిన అప్పగించి అక్రమాలకు తెరతీశారు. బూట్‌ పద్ధతి అంటే కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీ నిర్మాణాలు చేసుకుని దానిని పరిరక్షిస్తూ పచ్చదనంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ యాడ్స్‌ను వేసుకుని ఏజెన్సీ ఆదాయం పొందాలి. అదికూడా నిబంధనల ప్రకారం మొదట 3 సంవత్సరాలు మాత్రమే ఏజెన్సీకి ఇవ్వాలి. అనంతరం నగరపాలక టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్‌ అధికారులు ఏజెన్సీ డివైడర్ల మెయింటెన్స్‌ విషయంలో సంతృప్తి వెలిబుచ్చితే తిరిగి మరో 3 సంవత్సరాలు రెన్యువల్‌ చేయాలి. అయితే ఎమ్మెల్యే బంధువు కావడంతో నగరపాలక అధికారులు అత్యుత్సాహంతో ఏకంగా 9 సంవత్సరాలు లీజు కేటాయించి ప్రతి మూడు సంవత్సరాలకు రెన్యువల్‌ చేసేలా అనుమతులు ఇచ్చారు.

ఆదాయం లేకపోగా ఖజానాకు గండి
డివైడర్లకు సంబంధించి సదరు ఏజెన్సీకి 2014లో లీజుకు ఇస్తే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు దక్కకపోగా నగరపాలక నిధుల నుంచి డివైడర్లలో మొక్కలకు సుమారు రూ.20 లక్షలు, డివైడర్లకు రంగులు వేసేందుకు మరో రూ.50 లక్షలు కేటాయించి పనులు చేశారు. సదరు ఏజెన్సీ మాత్రం లాలీపాప్‌లో యాడ్‌ ప్రకటన ఇస్తే వేలల్లో వసూలు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. ఏజెన్సీకి లీజుకు ఇచ్చి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంత వరకు రెన్యువల్‌ చేయకుండా ఖజానాకు గండి కొడుతున్నారు. ఎక్కడైనా డివైడర్లు పగిలిపోయినా ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు పర్యటన ఉన్నప్పుడు ప్రతిసారి డివైడర్లకు రంగులు వేస్తూ ఓఎంసీ అధికారులు లక్షల్లో బిల్లులు చేసుకున్నారు.

డివైడర్లలో లాలీపాప్‌లు మాత్రమే ఏర్పాటు చేసి యాడ్స్‌ ప్రచురించాల్సిన ఏజెన్సీ డివైడర్లలోని విద్యుత్‌ స్తంభాలకు సైతం బోర్డులు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు.  అటు స్థానిక ఎమ్మెల్యే ఇటు నగరపాలక అధికారులు కుమ్మక్కై వాటాలు పంచుకుని నగరపాలక ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా నగరాభివృద్ధికి చెందాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకున్నారు. గతంలో వైఎస్సార్‌ సీపీ అధినేత ఒంగోలు పర్యటన సందర్భంగా లాలీపాప్‌ల్లో యాడ్స్‌ వస్తే ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో నగరపాలక అధికారులు వాటిని తొలగించి నానా బీభత్సం చేసిన విషయం తెలిసిందే. 
లాలీపాప్‌ల ఆక్రమణ.. పన్నుల వసూలు నిల్‌: 
టెండర్‌ ద్వారా లాలీపాప్‌లు ఏజెన్సీకి అప్పగించినా గజిట్‌ షరతులు ప్రకారం  ఎంక్రోచ్‌మెంట్‌ టాక్స్‌ (ఆక్రమణ పన్ను) విధించి టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు వసూలు చేయాలి. అయితే డివైడర్లలోని లాలీపాప్‌ యాడ్స్‌కు సంబంధించి చదరపు మీటరుకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయాలి. అయితే గడిచిన నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు.

ప్రకటనలు, ఆక్రమణ పన్నులు ఎమ్మెల్యే, ఓఎంసీ అధికారుల జేబుల్లోకే..
కార్పొరేషన్‌ చట్టం ప్రకారం నగరంలోని వ్యాపార కేంద్రాలు రోడ్డు ముఖంగా ఏర్పాటు చేసుకున్న ప్రకటనల బోర్డులకు సంబంధించి ప్రకటన పన్నులు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వసూలు చేయాలి. వాటికి కూడా చదరపు మీటర్ల లెక్కన పన్నులు విధించాల్సి ఉంటుంది. అయితే నగరంలో వేలాదిగా వ్యాపార కేంద్రాలు ఉంటే కేవలం వందల్లోనే ప్రకటన పన్నులు వసూలు చేస్తున్నారు. వ్యాపార కేంద్రాలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ఎమ్మెల్యే అండదండలు ఉండటం, వాటాలు కేటాయిస్తూ నగరపాలక ఆదాయానికి గండి కొడుతున్నారు. నిజంగా ప్రకటన పన్నులను కచ్చితంగా అమలు చేస్తే ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది.

నగరంలో ఆక్రమణ పన్నులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి. ఏ పన్ను విధించాలన్నా ఎమ్మెల్యే హుకుం జారీ చేయాలి. ఆయన అనుమతి లేకుండా నగరపాలక అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. వేలల్లో ఉన్న ఆక్రమణలకు సంబంధించిన పన్నులు వందల్లో వేస్తూ ఇష్టానుసారంగా కొలతలు చూపిస్తూ ఖజానాకు చిల్లు పెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలు వస్తే టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి కాసుల పంట కురుస్తోంది. వచ్చిన ఆదాయంలో ఎమ్మెల్యే వాటాను ఆయనకు పంపాల్సిందే.

కొంచెం నిర్మించి ఎక్కువ ఆదాయం వైపుగా..
సెంటర్‌ డివైడర్లు నిర్మించుకుని లాలీపాప్‌లు ఏర్పాటు చేసుకునే ఏజెన్సీకి లడ్డూలాగా నగరంలోని డివైడర్లు దొరికాయి. దాదాపుగా గతంలోనే నిర్మించిన డివైడర్లను కొంత మేరకు పొడిగించడమే తప్ప మొత్తం డివైడర్లు నిర్మించే అవసరం లేకుండా పోయింది. చర్చి సెంటర్‌ నుంచి నెల్లూరు బస్టాండ్‌ వరకు బాలినేని హయాంలోనే డివైడర్‌ నిర్మించారు. అక్కడి నుంచి బైపాస్‌ రోడ్డు వరకు మాత్రమే నిర్మించారు. చర్చి సెంటర్‌ నుంచి ఎస్‌బీఐ కూడలి వరకు పాత డివైడర్లు ఉన్నాయి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు.

అద్దంకి బస్టాండ్‌ నుంచి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్‌ వరకు గతంలోనే డివైడర్లు ఉన్నాయి. అద్దంకి బస్టాండ్‌ నుంచి గుంటూరు రోడ్డులో పోతురాజు కాలువ వరకు పాత డివైడర్లే. అక్కడి నుంచి బైపాస్‌ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు. పాత డివైడర్లు కొంత మేరకు మరమ్మతులు చేశారు. నగరంలోని డివైడర్లలో సుమారు 400 నుంచి 500 లాలీపాప్‌లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా ప్రకటనలు వేస్తూ సదరు ఎమ్మెల్యే బంధువుకు చెందిన ఏజెన్సీ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. మామూళ్ల మత్తులో ఉన్న నగరపాలక అధికారులు ఎమ్మెల్యే బంధువు కావడంతో ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నగరవాసులు మాత్రం ఎమ్మెల్యే బినామీ వ్యాపారం అని అనడం గమనార్హం.

కమిషనర్‌ చెప్పమంటే చెప్తా.. టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ కేవీ
ప్రకటనల పన్నులు, ఆక్రమణ పన్నులకు సంబంధించి వివరణ అడిగేందుకు వెళ్లగానే టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఏసీపీ) కనీసం విషయం కూడా తెలుసుకోకుండా ఏ వివరణ అయినా కమిషనర్‌ చెప్పమంటే చెప్తా లేకుంటే లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన అంశం అని చెప్పినా ఏ అంశం అయినా కమిషనర్‌ మాత్రమే చెప్తారు అని వివరణ ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు