తాగినోళ్లకు తాగినంత..

8 Apr, 2019 09:49 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : గ్రామాల వారీగా టీడీపీ నాయకులు మద్యం పంపిణీ చేస్తున్నారు. కుప్పం, మదనపల్లి, చంద్రగిరి, పీలేరు, పలమనేరుల్లో మందు పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. కుప్పంలో అయితే ఎన్నికల వరకు వలసలకు అడ్డుకట్ట వేసి మందు ఏరులైపారిస్తున్నారు. ప్రతి రోజూ రూ.500 చొప్పున పంచుతున్నారు. డబ్బుతో పాటు బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. అక్కడ పోలీస్‌ వ్యవస్థ మొత్తం టీడీపీకి బానిసగా మారిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

పంపిణీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శాంతిపురం వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ పైనే కేసు నమోదు చేశారు. పలమనేరులో మంత్రికి సంబంధించిన వాహనాల్లో యథేచ్ఛగా మందు పంపిణీ జరుగుతోంది. పోలీసుల కళ్లెదుటే పంపిణీ జరుగుతున్నా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటి రూ.1 కోటి విలువైన మద్యం పంపిణీ చేశామని మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తన సహచరులతో వాఖ్యానించారంటేనే టీడీపీ నాయకులు ఎంత బరితెగించారనేది అర్థమవుతుంది.

చంద్రగిరిలో నానికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. దీంతో ఓటర్లను పెద్దఎత్తున ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ నాయకులు విందు ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లనే వినియోగిస్తున్నారు. నిన్నటికి నిన్న మదనపల్లి నియోజకవర్గంలో కొనేటిపాళ్యంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ స్కూల్లో విందు ఏర్పాటుచేసి, మందు పంపిణీ చేస్తూ దొరికిపోయినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. పంపిణీ చేసిన వారిపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రోడ్లపైనే డబ్బు వెదజల్లుతున్నారు
గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేం దుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం అభ్యర్థి కనీసం రూ.45 నుంచి రూ.50 కోట్లు వరకు ఖర్చు చేయాలని అధిష్టానం నుంచే ఆదేశాలు రావడంతో పంపిణీ మొదలుపెట్టారు. పబ్లిగ్గానే డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కుప్పంలో అయితే ఇంటికి రూ.20 వేల చొప్పున ఓట్లు కొనుగోలు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలయితే నాలుగు ఓట్లున్న కుటుంబానికి కనీసం రూ.35 వేల చొప్పున పంచుతున్నారు. పలమనేరులో మంత్రి అమర్‌నాథ రెడ్డి ఓటుకు రూ.2000 పంపిణీ చేస్తున్నారు. పీలేరులో కిశోర్‌ కుమార్‌ రెడ్డి అనుచరుల ద్వారా రాత్రికి రాత్రి పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి గ్రామానికీ ఇంత అని చెప్పి పంపిణీ చేస్తున్నారు. సత్యవేడులో డబ్బు పంపిణీ చేయలేదని జెడ్డా రాజశేఖర్‌పై అధిష్టానం సీరియస్‌ అయింది. దీంతో ఆయన కూడా మొదలుపెట్టారు. గంగాధర నెల్లూరులో హరిక్రిష్ణ అనుచరులు స్లిప్‌లు పంపిణీ చేస్తూ డబ్బులు ఇస్తున్నారు.  

మరిన్ని వార్తలు