క్వారీల్లో ఉపాధికి ఘోరి..

27 Mar, 2019 11:03 IST|Sakshi

సాక్షి, దాచేపల్లి(గురజాల) : ఉదయం నుంచి సాయంత్రం వరకు కండలను కరిగించి రాళ్లను బద్దలుకొట్టేవారు. వచ్చే ఆదాయంతో ఇంటిల్లిపాదీ చీకూచింతా లేకుండా హాయిగా జీవించేవారు. కాలేజీ విద్యార్థులు సైతం అప్పుడప్పుడు క్వారీల్లో పనులకు వెళ్లి వచ్చే డబ్బులను చదువుకోసం ఖర్చుచేసేవారు. హాయిగా సాగుతున్న వారి జీవితాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ మైనింగ్‌ దెబ్బతీసింది. అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో క్వారీలన్నీ మూతపడ్డాయి.

వడ్డెరలకు పనికరువైంది. చేసేదేమీలేక ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వలసబాట పట్టారు. కండలు కరిగించి రాళ్లు బద్దలు కొట్టి జీవనం సాగించే వడ్డెర కార్మికుల బతుకుల్లో టీడీపీ నాయకులు చీకట్లు నింపారు. ఒకప్పుడు దర్జాగా బతికిన వడ్డెర కార్మికులు నేడు దయనీయ పరిస్థితుల్లో జానెడు పొట్టనింపుకొనేందుకు కొందరు వలస బాట పట్టగా, మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా మారారు. నిత్యం సమ్మెట చప్పుళ్లు, వడ్డెర కార్మికుల కబర్లతో సందడిగా కనిపించే క్వారీలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి.

కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో క్వారీలతోపాటు, గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు అక్రమంగా క్వారీలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు సాగించిన అక్రమ మైనింగ్‌తో దాచేపల్లి మండలంలోని నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల మండలంలోని కొనంకి గ్రామాల్లో క్వారీలు మూతపడ్డాయి.

దీంతో వడ్డెర కార్మికులు వలసబాట పట్టారు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లకు తాళాలు వేసి తట్టాబుట్ట సర్దుకుని ఉపాధిని వెతుక్కుంటూ వలసబాట పట్టారు. వడ్డెర కార్మికులు అధికంగా నివసించే నడికుడి పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీ నిర్మానుషంగా ఉంది. 

క్వారీల్లో యరపతినేని అనుచరుల పాగా
నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో క్వారీపై ఆధారపడి ఈ మూడు గ్రామాల్లోనే మూడు వేల మందికి పైగా వడ్డెర కార్మికులు జీవించేవారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వడ్డెర కార్మికులు నిర్భయంగా క్వారీ పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డెర కార్మికుల బతుకులు పూర్తిగా మారాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు క్వారీలను బలవంతంగా లాగేసుకున్నారు.

నడికుడిలో వడ్డెర సొసైటీకి ఉన్న రెండున్నర ఎకరాల లీజును రద్దు చేయించి ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు, ఓ సిమెంట్‌ కంపెనీ సొంత భూముల్లో సైతం అక్రమంగా మైనింగ్‌కు పాల్పడి రాయిని తవ్వి తరలించేశారు. కేసానుపల్లిలో ప్రభుత్వ భూములతో పాటుగా ప్రైవేట్‌ వ్యక్తుల భూముల్లో కూడా అక్రమంగా క్వారీ పనులు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. 

వడ్డెర కార్మికుల శ్రమ దోపిడీ
క్వారీలను లాగేసుకున్న టీడీపీ నాయకులు వారి శ్రమను సైతం దోచుకున్నారు. గతంలో ట్రక్కు రాయి కొడితే రూ.600లకు పైగా కూలి వచ్చేది. టీడీపీ నాయకులు మాత్రం రూ.450 చొప్పున సరిపెట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా కార్మికుల శ్రమ దోపిడీలో భాగస్వాములుగా మారడంతో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజూ వేల టన్నుల తెల్లరాయిని రవాణాచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టీడీపీ నాయకులు తమకు రావాల్సిన కూలిలో సైతం కోత విధించారని కార్మికులు ఆరోపించారు.  

వలసబాట పట్టిన కార్మికులు
అక్రమమైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో అక్రమమైనింగ్‌ నిలిచిపోయింది. గతంలో చట్టప్రకారం రాయల్టీ చెల్లించి క్వారీలను నడిపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయల్టీ చెల్లించకుండా ఇష్టానుసారంగా క్వారీలను నిర్వహిస్తుండటంతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అక్రమమైనింగ్‌లో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు నిలిచిపోయాయి. దీంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇంటి వద్ద వృద్ధ తల్లిదండ్రులను వదిలిపెట్టి అతికష్టం మీద వలసలకు పయనమయ్యారు. క్వారీ పనులు లేకపోవటంతో కొంతమంది వడ్డెర కుటుంబాల్లోని పిల్లల చదువులు కూడా ఆగాయి.

క్వారీని వదిలి.. డ్రైవర్‌గా కుదిరి..
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్ల అమరలింగేశ్వరరావు. 17 సంవత్సరాల వయస్సు నుంచే క్వారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరుకుమార్తెలు, ఒకకుమారుడు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్వారీలను అక్రమించుకున్నారు. టీడీపీ నాయకులు కొంతకాలం అమరలింగేశ్వరరావుతో పనులు చేయించినా, వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడంతో పనులకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత బతుకుదెరువు కోసం జేపీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడా పని కల్పించకుండా యజమాన్యంపై టీడీపీ నాయకుడు బత్తుల రాంబాబు వత్తిడిచేశాడు.

చేసేదేమీలేక ఇప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్వారీ పనుల్లో రూ.800 ఆదాయం వచ్చేది. ఇద్దరు పిల్లలను చక్కగా చదివించుకునేవాడు. ఇప్పుడు డ్రైవర్‌గా వెళ్లడం వల్ల ఆదాయం తగ్గిపోయింది. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణభారంగా మారింది. కష్టపడితే నాలుగు రూపాయలు వచ్చే క్వారీ పనులు మానుకుని డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. టీడీపీ నాయకులు తాను క్వారీ పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకుని పంతం నెగ్గించుకున్నారు.  

తాపీ పనులు చేస్తున్నా
క్వారీ పనులు నిలిచిపోవటం వలన పొట్టచేతపట్టుకుని విజయవాడకు వెళ్లి తాపీ పనులు చేసుకుని బతుకుతున్నా. అక్కడ కూడా పనులు అడపా దడపా మాత్రమే లభిస్తున్నాయి. నాకు ఇచ్చే కూలి తినటానికి, ఉండటానికే సరిపోతుంది. అంతా దూరం వెళ్లి నేను సంపాదించిందేమీలేదు. క్వారీ పనులు ఉంటే కుటుంబంతో కలిసి హాయిగా పనిచేసుకుని ఇక్కడే ఉండేవాళ్లం. ఇప్పుడు నేను విజయవాడలో, నా కుటుంబం అంజనాపురంలో ఉంటోంది. 
–వేముల క్రిష్టయ్య

చదువులకు అటంకం
నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. క్వారీ పనులు ఉంటే రోజూ ఉదయం పనికి వెళ్లి ట్రక్కురాయి కొడితే రూ.600 వచ్చేవి. ఆ డబ్బును చదువు కోసం ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు క్వారీ పనులు లేవు. చదువుకు ఆటంకంగా మారింది. చదువుకోవటం ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఇలానే ఉంటే చాలామంది చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. 
– బత్తుల చిన్నపరాజు 

మరిన్ని వార్తలు