పండుల వర్సెస్‌ గొల్లపల్లి

4 Mar, 2018 10:01 IST|Sakshi

మధ్యలో రాపాక  

రాజోలు టీడీపీలో ఆధిపత్యం కోసం త్రిముఖ పోరు

నలిగిపోతున్న తెలుగు తమ్ముళ్లు

పార్టీ పరువు నవ్వులపాలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అంటేనే రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రంకెలు వేస్తున్నారు. ఎంపీ పేరు ఎత్తితే చాలు ఎమ్మెల్యే చిర్రెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో తనదే పైచేయి అని, తన మాటే వేదవాక్కని, ఇందులో ఎవరి పెత్తనం కుదరదు అన్నట్టుగా గొల్లపల్లి వ్యవహరిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొస్తున్న వారిని ఆమడదూరంలో పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఒకరు. ఎంపీ రవీంద్రబాబు, రాపాక వరప్రసాద్‌లు ఒకే తాను ముక్కగా భావిస్తూ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఎమ్మెల్యే ముందు ఎంపీ ప్రస్తావన తేడానికి టీడీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ‘ముందుకెళితే నుయ్యి ... వెనక్కి వెళితే గొయ్యి’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు.

తొలి నుంచీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరు
గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్‌ కోసం గొల్లపల్లి సూర్యారావు యత్నించారన్న వాదనలున్నాయి. అయితే వేర్వేరుగా లాబీయింగ్‌ ద్వారా పండుల రవీంద్రబాబుకు టిక్కెట్‌ దక్కింది. దీంతో గొల్లపల్లి తట్టుకోలేక ఎంపీకి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారని సమాచారం. 2014 ఎన్నికల ఖర్చు కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు దారితీసిందనే వాదనలున్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలో ఎంపీ పండుల రవీంద్ర బాబు రాజోలు నియోజక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వర్గీయుల వాదన. రాజోలు నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. మిగిలిన నియోజక వర్గాలకు మాత్రం ఆయన దండిగా నిధులు పంపారని,  రాజోలులో గొల్లపల్లిని ఓడించడం కోసమే పండుల అలా చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే  ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడాకి కారణమని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనను దూరంగా పెట్టినప్పుడు తానెందుకు వెనక్కి తగ్గాలని ఎంపీ కూడా నియోజక వర్గం ఎప్పుడువచ్చినా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లరు. తన అనుయాయుల ఇళ్లకు వెళ్లి వెనుతిరగడం...ఇలా నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది.

ఆరోపణల దాడి...
మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుల మధ్య కాంట్రాక్టుల విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. ఇరిగేషన్, రోడ్డు పనులను తన ఆనుయాయులకు కట్టబెట్టి ఎమ్మెల్యే గొల్లపల్లి లబ్ధిపొందుతున్నారని రాపాక వర్గీయులు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. బినామీల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నారని, డబ్బులిస్తేనే  పని చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు.
మామిడికుదురు మండలం ఆదూరులో సొంతంగా పెట్టుకున్న కళాశాలకు కాంట్రాక్టర్లు, లబ్ధిపొందిన వారిని ఉపయోగించుకుంటున్నారని గొల్లపల్లిపై పరోక్ష ఆరోపణలకు దిగారు.   ఆ కళాశాలకు అవసరమైన ఇసుకను అడ్డంగా తరలించేశారని ఆరోపిస్తూ అప్పట్లో రాపాక వరప్రసాదరావు ఆ కళాశాలకు వెళ్లి పరిశీలించి హడావుడి చేశారు. తన కళాశాలకు వచ్చి హల్‌చల్‌ చేయడమేంటని గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఇక, గొల్లపల్లి వర్గం కూడా రాపాకపై కౌంటర్‌ ఆరోపణలకు దిగింది. చింతలమోరిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు వరప్రసాదరావు అండగా నిలిచారని ప్రత్యారోపణలకు దిగారు. తనకు శత్రువుగా తయారైన ఎంపీని కూడా గొల్లపల్లి వర్గం వదల్లేదు. కోటిపల్లి– నర్సాపూర్‌ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ మార్పులో చేతులు మారాయని పరోక్ష ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

సన్మానంపైనా గ్రూపు రాజకీయాలు.
కోటిపల్లి– నర్సాపూర్‌ రైల్వే లైన్‌కు పండుల కృషి చేశారని రాపాక వరప్రసాద్‌ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మానం చేస్తున్నట్టు కరపత్రాలు ముద్రించారు. దీన్ని టీడీపీలో ఉన్న గొల్లపల్లి వర్గం వ్యతిరేకించింది.  ఎస్సీ సంక్షేమ సంఘానికి సంబంధం లేదని తమకు అనుకూల నాయకుల చేత ప్రెస్‌మీట్‌లు పెట్టి హడావుడి చేయించారు. అయినప్పటికీ రాపాక వర్గం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ రవీంద్రబాబును పిలిచి ఘనంగా సన్మానించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టినట్టు చేసింది. ప్రతీకారేచ్ఛ రాజకీయాలకు మరింత ఊపు ఇచ్చినట్టు అయ్యింది. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే, మధ్యలో రాపాక వరప్రసాదరావు రాజకీయాలతో రాజోలు టీడీపీ హాట్‌ హాట్‌గా ఉంది.

ఎంపీ చెంత చేరిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందర్నీ ఎంపీ ఆదరిస్తున్నారు. తొలుత రాపాక పండుల రవీంద్ర చెంత చేరారు. రాపాకను వెంట వేసుకుని తిరుగుతుండడంతో గొల్లపల్లిలో ఆవేదన అధికమైంది. గత ఎన్నికల్లో టిక్కెట్‌కు పోటీపడ్డ బత్తుల రాము వర్గీయులను తొలుత ఎమ్మెల్యే  దూరంగా పెట్టారు. తనకు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారన్న అనుమానంతో కక్ష పెట్టుకున్నారు. దీంతో ఆయన తప్పని పరిస్థితుల్లో ఎంపీ గూటికి చేరారు.  ఇక, క్షత్రియ సామాజిక వర్గానికి  చెందిన ముదునూరి చినబాబు (జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు)తో కూడా  ఎమ్మెల్యేకు  వైరం వచ్చింది.ఆయన కూడా ఎంపీ పక్కన చేరారు. ఇలా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు, రాపాక ఒక గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది.  ఎంపీని ఎవరు కలిస్తే వారిని వ్యతిరేకులుగా చూడటం మొదలు పెట్టారు. వారిని బహిరంగంగా తిట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా ఎంపీ గ్రాంటుతో పనులు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న గ్రామ నాయకులతో తీర్మానాలు ఇవ్వకుండా, అధికారుల సహకారం లేకుండా ఎంపీకి అడ్డు తగులుతూ వస్తున్నారు.  

గొల్లపల్లికి కొరకరాని కొయ్యగా రాపాక
ఎంపీతో విభేదాలు ఇలా ఉంటే...స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కూడా ఎమ్మెల్యే గొల్లపల్లికి తీవ్ర విభేదాలున్నాయి. ఎన్నికల్లో గెలిచాక రాపాకను ఎమ్మెల్యే దూరం పెట్టడం మొదలు పెట్టారు. రాపాక నిలదొక్కుకుంటే భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చనే భయంతో గొల్లపల్లి వ్యూహాత్మకంగా రాజకీయాలకు తెరదీశారు. దీన్ని గమనించిన   రాపాక కూడా తనదైన శైలి రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్న అక్కసుతో గొల్లపల్లికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు.

ఇదే అదనుగా చూసుకుని ఎంపీ రవీంద్రబాబుతో కలిసి ప్రయాణం సాగించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టేలా చేసింది. ఎంపీ, రాపాక లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలను ఎమ్మెల్యే గొల్లపల్లి  మొదలు పెట్టారు. గొల్లపల్లి, రాపాక మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడానికి మరో కారణం కూడా ఉంది. రాపాక ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో చింతలమోరి గ్రామానికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ మంజూరైంది. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు ప్రతీకార రాజకీయాలకు శ్రీకారం చుట్టి రాపాక సొంతూరైన చింతలమోరిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పెట్టడం ఇష్టం లేక  శంకరగుప్తానికి మార్చారు. తన గ్రామానికి మంజూరైన లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను వేరే గ్రామానికి మార్చుతారా? అని రాపాకలో కసి పెంచింది. ఇంకేముంది గొల్లపల్లి లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు