ఓట్ల వేటలో కట్టలపాములు

21 Mar, 2019 07:59 IST|Sakshi
సుంకరమెట్ట చెక్‌పోస్టు వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్న రూ 6.40లక్షల నగదు

ప్రలోభాలకు అప్పుడే తెరతీసిన పచ్చనేతలు

అడ్డుకోవాల్సిన అధికారులే వత్తాసు

నర్సీపట్నంలో వెలుగు సిబ్బంది ద్వారానే పంపిణీ

మూడో రోజుల్లో రూ.1.20 కోట్ల నగదు పట్టివేత

వీటిలో 80 శాతం వరకు టీడీపీ నేతలకు చెందినవేనని అరోపణలు

షెడ్యూల్‌ వెలువడకముందే మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో రూ.3 కోట్ల విలువైన చీరలు, గొడుగుల సంతర్పణ.. దర్జాగా డీఆర్‌డీఏ సిబ్బంది ద్వారానే పంపిణీ..అదే ఊపులో.. అదే డీఆర్‌డీఏ ద్వారా పశసంవర్థక శాఖ సహకారంతో రూ.కోటి విలువైన పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ.. ఇందుకోసం ప్రత్యేకించి నియోజకవర్గంలో 60 మంది సీఆర్పీల కేటాయింపు.. మంత్రి నియోజకవర్గంలోనే ఇలా బరితెగిస్తుంటే.. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ విచ్చలవిడిగా సాగుతున్న పంపిణీ పర్వం.మరోవైపు షెడ్యూలు వచ్చి.. నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైన ఈ మూడు రోజుల్లోనే రూ. 1.20 కోట్ల నగదు కట్టలు స్వాధీనం.. వీటిలో 80 వరకు టీడీపీ నేతలకు చెందిన వాహనాల్లో తరలిస్తున్నవే..ఓట్ల వేటకు పచ్చనేతలు కట్టల పాములను వదులుతున్నారన్న దాన్ని ఈ ఉదంతాలు బలపరుస్తున్నాయి. విశృంఖలంగా సాగుతున్న ఈ కోడ్‌ ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఆ పని చేయకపోగా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలు అప్పుడే ప్రలోభాలకు తెరతీశారు. ఎక్కడికక్కడ డబ్బులు, బంగారం, దుస్తులు పంపిణీకి శ్రీకారం చుట్టేశారు. కేవలం మూడురోజుల వ్యవధిలో రూ.1.2 కోట్లు పట్టుబడిందంటేనే అర్థమవుతోంది.. ఆయా ప్రాంతాలకు నగదును ఎలా సర్దుబాటు చేస్తున్నారో. డబ్బు తరలిస్తున్న 14 వాహనాలను సీజ్‌ చేస్తే, అందులో దాదాపు 80 శాతం వాహనాలు టీడీపీ, జనసేన నేతలకు చెందినవేనని అధికారులు సైతం పరోక్షంగా అంగీకరిస్తున్నారు. మంగళవారం సబ్బవరంలో పట్టుబడిన రూ.కోటి నగదు మంత్రి, టీడీపీ కీలక నేత అయిన వ్యక్తి నుంచి పెందుర్తి నియోజకవర్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగదు తరలించే వాహనంపై తెలుగుదేశం పార్టీ స్టిక్కర్‌ కూడా ఉంది. మొత్తానికి ఓటమి భయంతో వణుకుతున్న టీడీపీ డబ్బుతో గట్టెక్కాలన్న తాపత్రయం ఈ ఘటనతో బట్టబయలైంది.

గత ఐదేళ్లలో సంపాదించిన అక్రమార్జనలో ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్ల వరకు లిక్విడ్‌ క్యాష్‌ అధికార టీడీపీ అందుబాటులో ఉంచిందని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇంకా నామినేషన్ల పర్వం ముగియకముందే «డబ్బు ప్రవాహం మొదలైంది. షె డ్యూల్‌ వెలువడక ముందే చీరలు, పంచెలు, గొడుగులు పంచేసిన అధికార పార్టీ నేతలు.. తమ అభ్యర్థిత్వాలు ఖరారు కాగానే డబ్బుల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టేశారు. గత మూడు రోజుల్లో అక్షరాల రూ.కోటి 19 లక్షల 88 వేలు పట్టుబడ్డాయి. లెక్కలు చూపని ఈ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు చెందినదేనని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారు. ఇంకా నామినేషన్‌ వేయకుండానే ఏజెన్సీ లో రాష్ట్ర మంత్రి కిడారి సర్వేశ్వరరావు టీడీపీ తరపున బరిలోకి దిగుతున్న అరకు నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయడమే కాకుండా వారితో ప్రమాణాలు కూడా చేయించుకున్న ఘటనలు వెలుగుచూశాయి.

అనకాపల్లిలో గ్రామున్నర బంగారం?
అనకాపల్లిలో అయితే అధికార టీడీపీ నేతలు అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గ్రామున్నర బంగారం కూడా పంపిణీ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ గతంలో టీడీపీలో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నేతలే టీడీపీ, జనసేన పార్టీల తరపున బరిలో నిలవడం, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో ఇ రువురు దొడ్డిదారిన పంపిణీలకు శ్రీకారం చుట్టారని తెలు స్తోంది. ఇక నామినేషన్ల పర్వం ముగియగానే పంపిణీల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నర్సీపట్నంలో  చీరలు, పంచెల పంపిణీ
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. షెడ్యూల్‌ విడుదలకు నెల రోజుల ముందే డ్వాక్రా సభ్యులు, పింఛన్‌దారులకు దాదాపు రూ.3 కోట్ల విలువైన చీరలు, పంచెలు పంపిణీ చేశారు. మంత్రి అయ్యన్న సతీమణి, కుమారులే స్వయంగా ఈ పంపిణీ చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. సంఘాల వారీగా సభ్యులను గుర్తించి డీఆర్‌డీఏ సిబ్బంది ద్వారానే పంపిణీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అలాగే షెడ్యూల్‌కు ముందు పశుసంవర్ధక శాఖ సమన్వయంతో డీఆర్‌డీఏ ద్వారా మరే ఇతర నియోజకవర్గంలోనూ లేని విధంగా మంత్రి నియోజకవర్గంలో రూ.కోటి విలువైన పశువులు, మేకలు, గొర్రెలు పంపిణీ చేశారు.

డబ్బుల పంపిణీ కోసంఅదనపు సిబ్బంది
తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో మండలానికి 10–12 మంది సీఆర్పీలతోపాటు ఇతర సిబ్బంది కలిపి మూడు మండలాల్లో 60 మంది సిబ్బందిని అదనంగా నియమించారని తెలియవచ్చింది. వీరిని ఎందుకు డెప్యూట్‌ చేశారో కూడా తెలియని పరిస్థితి. వీరికి డీఆర్‌డీఏ తరపున రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా వీరికి అదనంగా నెలకు రూ.15వేల వరకు ముట్టజెబుతున్నట్టుగా తెలియవచ్చింది. వీరి ద్వారా రానున్న మూడు వారాలు డబ్బుల పంపిణీ లోపాయి కారిగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇక్కడ ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేయబోతున్నారంటున్నారు. మంత్రి ఒక్కరికే కాదు.. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వెలుగుసిబ్బందిని వినియోగించుకునేలా డీఆర్‌డీఏలో ఐదేళ్ల పాటు పాతుకుపోయిన ఓ కీలక అధికారి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా ఎన్నికల అబ్జర్వర్స్, వ్యయ పరిశీలకులు అధికార టీడీపీ నేతల ప్రలోభాలపై ప్రత్యేక నిఘాపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు