టీడీపీలో రాజుకుంటున్న అగ్గి!

18 Jul, 2014 02:12 IST|Sakshi
టీడీపీలో రాజుకుంటున్న అగ్గి!

 ఎన్నికల సమయంలో ఒకరి టిక్కెట్‌ను ఇంకొకరు తన్నుకుపోయారు. దీనికి ప్రతీకారంగా రెబల్‌గా రంగంలోకి దిగి అతని ఓటమికి కారణమై మరొకరు కక్ష తీర్చుకున్నారు. వారిద్దరే నిమ్మక జయరాజ్, జనార్దన్ థాట్రాజ్. అయితే జయరాజ్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని  ప్రయత్నాలు సాగుతుండడంతో దానికి థాట్రాజ్ వర్గం తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతోంది. పార్టీ ఓటమికి కారణమైన వారిని మళ్లీ ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  దీంతో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : కురుపాం నియోజకవర్గం టీడీపీలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ రెబెల్‌గా బరిలోకి దిగి న నిమ్మక జయరాజ్‌ను పార్టీలోకి రప్పించే యత్నాలను జనార్దన్ థాట్రాజ్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని మళ్లీ ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నా రు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ ఉండేవా రు. కాకపోతే, ఎన్నికల సమయానికొచ్చేసరికి సీటు రాకపోవడం వల్ల వేరే పార్టీలోకి జంప్ చేయడమో, రెబల్‌గా  బరిలో దిగడమో చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లు పార్టీకి దూరమవుతున్నారు. అంతా సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో చేరుతున్నారు. మళ్లీ క్రియాశీలకంగా తయారవుతున్నారు.  గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది.
 
 మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టిక్కెట్ తనదే అని జయరాజ్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరడంతో కురుపాం టిక్కెట్‌ను ఆయన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు ఎగరేసుకుపోయారు. చంద్రబాబుతో విజయరామరాజు చేసుకున్న ఒప్పందంలో భాగంగా నిమ్మక జయరాజ్‌కు మొండిచేయి ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతీసారి ఇలాగే జరుగుతోందని ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించి, టీడీపీ రెబెల్‌గా పోటీ చేశారు. కానీ ఓటర్లు కనికరించలేదు. మళ్లీ ఓడించారు. దీంతో స్తబ్ధుగా ఉండిపోయారు.  టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయనకు పార్టీపై మోజు ఏర్పడింది. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
 ఆయన్ను కలుపుకొని పనిచేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తదితరులు తహతహలాడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సానుకూల సంకేతాలొచ్చాయో ఏమో గాని జియ్యమ్మవలస మండల పరిషత్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అందరూ కలుపుకొని పనిచేద్దామని జగదీష్ అన్నారు. పార్టీలోకి రావాలని జయరాజ్‌కు పరోక్షంగా సూచించారు. దీంతో జయరాజ్ కూడా స్పందిస్తూ తాను పార్టీలోనే ఉన్నానని, తనకు టిక్కెట్ రాకపోవడం వల్లఅన్యాయం జరిగిందని బాధపడ్డానని చెప్పుకొచ్చినట్టు తెలిసింది.    ఈ పరిణామాలన్నీ తెలుసుకున్న జనార్దన్ థాట్రాజ్‌తో పాటు ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసేం దుకు చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు సమాచా రం. జయరాజ్ విషయంలో ఒక్క థాట్రాజే కాదు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు