దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!

30 Jul, 2019 09:26 IST|Sakshi
అనమనమూరులో అక్రమంగా సాగు చేస్తున్న చేపల చెరువు 

సర్కార్‌ భూముల్లో చేపల చెరువుల సాగు

గత ప్రభుత్వం హయాంలోనే టీడీపీ నేతల అక్రమం

చెరువులు లీజుకిచ్చి రూ.లక్షలకు లక్షలు దండుకుంటున్న నేతలు

అద్దంకి నియోజకవర్గంలో అక్షరాలా 130 ఎకరాలు అన్యాక్రాంతం

పట్టించుకోని మత్స్య, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల ఉన్నతాధికారులు

టీడీపీ నేతలకు సర్కార్‌ భూములు మేతగా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారం అడ్డు పెట్టుకుని సర్కార్‌ భూములు ఆక్రమించుకుని ఏకంగా చెరువులు తవ్వారు. అంతేకాకుండా మట్టి, ఇసుక విక్రయాలతో పాటు తవ్విన ఆ చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి అక్రమార్జనతో లక్షల రూపాయలు అప్పనంగా ఆర్జిస్తున్నారు. ఇదంతా అద్దంకి నియోజకవర్గం అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అదంతా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్యవహరిస్తుడటం గమనార్హం.

సాక్షి, అద్దంకి/మేదరమెట్ల: అధికారం అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. సర్కార్‌ భూములను సైతం ఆక్రమించుకుని చెరువులుగా మార్చారు. చెరువులు తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా అమ్ముకుని రూ.లక్షలకు లక్షలు ఆర్జించి జేబులు నింపుకుంటున్నారు. అంతటితో ఆగకుండా చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా ఆర్జన అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా ఇప్పటికీ టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన మత్స్య, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యహరిస్తున్నారు. దీంతో వారి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 

130 ఎకరాల ప్రభుత్వ భూముల్లో చెరువులు
చెరువుల్లో నీరు–చెట్టు పేరుతో గత ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుకను విక్రయించిన టీడీపీ నేతలు గుండ్లకమ్మ ముంపు భూములనూ వదల్లేదు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నిర్మాణంతో మంపునకు గురైన భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో ధేనువుకొండ, మణికేశ్వరం, అనమనమూరు, తమ్మవరం గ్రామాల పరిధిలో సుమారు 130 ఎకరాలకుపైగా ముంపు భూమిని ఆక్రమించారు, ఆక్రమణ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వారు. చెరువులను తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా ట్రక్కు రూ.600 నుంచి రూ.1000కి విక్రయించి జేబులు నింపుకున్నారు. 

లీజుతో రూ.లక్షలు అక్రమార్జన
రెండు మండలాల్లో కలుపుకుని ముంపు భూముల్లో 40 నుంచి 45 చెరువులు తవ్వారు. ఆ చెరువులను లీజుకిచ్చారు. లీజుకు తీసుకున్న వారు చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. ఇలా ఒక్కో చెరువును ఆక్రమణదారులు ఏడాదికి రూ. 20 నుంచి రూ.25 వేల వరకు లీజు దారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ చెరువుల్లో లీజుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా చేపల పెంపకం చేపడుతున్నారు.

పెరుగుతున్న కాలుష్యం
ప్రభుత్వ భూముల్లో ఆక్రమంగా ఏర్పాట చేసిన చెరువుల్లో లీజుదారులు చేపల పెంపకం చేపట్టి చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలతో పాటు మాంస వ్యర్థాలు వేస్తున్నారు. ఈ నీటిని సమీపంలోని గుండ్లకమ్మ నీటిలో వదులు తుండటంతో నీరు కలుషితం అవుతోంది. 

ఇంజిన్‌తో చెరువులకు తరలిస్తున్న గుండ్లకమ్మ నీరు 

సాగు,తాగు నీరు చేపల చెరువులకు మళ్లింపు 
చేపల పెంపకం కోసం అనుమతులు లేకుండా తాగు, సాగు నీటిని యథేచ్ఛగా గుండ్లకమ్మ నది నీటిని మోటార్లతో తోడి చెరువులు నింపుకుంటున్నారు. దీంతో తాగు,సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాస్తవంగా చేపల చెరువుల యజమానులు చెరువులు నింపుకోవడం కోసం ముందుగానే సంబంధిత అధికారుల నుంచి ఏ నీటితో చెరువులు నింపుతారో తెలియజేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 

పట్టించుకోని అధికారులు 
ముంపు భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు, మట్టి తవ్వకాలు జరపవద్దనే నిబంధన ఉన్నా ఆక్రమణదారులు లెక్క చేయడం లేదు. వందల ఎకరాల ముంపు భూములను ఆక్రమించుకుని చెరువుల ఏర్పాటుతో మట్టి ఇసుక, అమ్మకాలతో పాటు చేపల పెంపకానికి లీజుకిచ్చి దబ్బు దండుకుంటున్నా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్య్వహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు