చింతలపాలెంపై ఎమ్మెల్యే శీతకన్ను!

20 Mar, 2019 09:01 IST|Sakshi

గెలిచాక గ్రామానికి రాని వైనం

కుగ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే!

ఓట్ల కోసం వస్తే నిలదీస్తామంటున్న గ్రామస్తులు

సాక్షి, చింతలపాలెం (ప్రకాశం): పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత చింతలపాలెం గ్రామానికి వర్తిస్తుంది. ఓట్ల పండగ వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ గ్రామం గుర్తుకు రాదు. సమస్యలతో నేడు ఆ గ్రామస్తులు సహవాసం చేస్తున్నారు. ఇంకొల్లు, పావులూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ గ్రామం ఉంది. దీంతో సమస్యలను పరిష్కరించటంలో రెండు పంచాయతీలు శ్రద్ధ చూపటం లేదు. దీంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ప్రధాన సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణం సగంలో ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేకుండా పోయింది.

కనీసం విద్యార్థులు బడికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక అంగన్‌వాడీ కేంద్రం ఉన్నాయి. గ్రామం మొత్తం పశుపోషణపై ఆధార పడి జీవిస్తున్నారు. కనీసం పశువులకు ఏదైనా బాగోలేక పోతే ఇంకొల్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.  రక్షిత మంచి నీటి పథకం మూలన పడిపోయింది. గ్రామంలో పెద్ద చెరువు ఉన్నప్పటికీ రక్షిత నీరు గ్రామస్తులకు అందించిన పాపాన పోలేదు. కనీసం రేషన్‌ దుకాణానికి వెళ్లాలంటే ఇంకొల్లుకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటే ఇంకొల్లులోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో రెండు సిమెంటు రోడ్లు వేశారు. కాలువలు ఏర్పాటు చేయలేదు. లింకు రోడ్లు ధ్వంసమయ్యాయి. డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండటంతో దోమలు కాటేస్తున్నాయి. గ్రామంలో రెండు తాగునీటి బావులు ఉన్నాయి. బావుల్లో ఫ్లోరిన్‌ శాతం అధికంగా ఉంటుందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

గ్రామం  చింతలపాలెం
జనాభా  150
కుటుంబాలు  35
ఓటర్లు  130 
ప్రాథమిక పాఠశాల  1
అంగన్‌వాడీ సెంటర్‌  1
రేషన్‌ దుకాణాలు  లేవు
చెరువు విస్తీర్ణం  25 ఎకరాలు
వ్యవసాయం  చెరువు ఆయకట్టు - 400 ఎకరాలు

ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తారు
గ్రామంలో ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తున్నారు. చిన్న గ్రామంలో ఓటర్ల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామానికి రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. పశుపోషణపై గ్రామంలో ఆధారపడి జీవిస్తున్నారు. బయటకు వెళ్లి బతకాలంటే జరగని పరిస్థితి కాదు.
– పులికం రామకృష్ణారెడ్డి, యువకుడు

గ్రామంలో సమస్యలు అలానే తిష్టవేసి ఉన్నాయి
గ్రామంలో సమస్యలు అలానే ఉన్నాయి. చెరువులో మట్టి కావాల్సిన వారు అనుమతులు లేకుండా తోలు కుంటున్నారు. దీంతో రోడ్లు గుల్ల అవుతున్నాయి. రెండు గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం కావటమే మేము చేసుకున్న పాపం. అభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
– మాదాసు సాంబశివరావు, గ్రామస్తుడు

మరిన్ని వార్తలు