ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే

11 Apr, 2019 11:43 IST|Sakshi
కొత్తమల్లాయపాలెంలో బుధవారం రాత్రి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే, పాతమల్లాయపాలెం చర్చిలో ఓటర్లతో సమావేశమై మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రచారం గడువు ముగిసినప్పటికీ  మంగళ, బుధవారాల్లో ఇంటింట ప్రచారం చేసిన గొట్టిపాటి

ప్రేక్షకపాత్రలో కోడ్‌ అధికారులు, పోలీసులు

పాక్షి, బల్లికురవ (ప్రకాశం): ఓటమి భయంతోనే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని, తనకు అధికార అండదండలు ఉన్నాయని మంగళవారం రాత్రి మండలంలోని వెలమవారిపాలెం, కొత్త జమ్మలమడక, అద్దంకి మండలంలోని ఏలేశ్వరవారి పాలెంలో ప్రచారం చేపట్టారు.

అంతటితో ఆగకుండా బుధవారం రాత్రి బల్లికురవ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో తన క్వారీలకు సమీపంలో ఉన్న కొత్తమల్లాయపాలెం, యానాదిసంఘం, పాతమల్లాయపాలెం గ్రామాల్లో కూడా ఓటర్లను కలుసుకుని తనకు ఓట్లువేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఎస్సీ కాలనీలు, చర్చిల్లో సమావేశాలు అయి మీ అభివృద్ధికి పాటుపడతానని మీలో ఒకడిగా నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేస్తారని వారిని గుర్తించి బెదింపులకు కూడా పాల్పడుతున్నారని గ్రామానికి చెందిన నేతలు వాపోతున్నారు.

ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల అధికారులు, పోలీస్‌లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్సార్‌ మండల అధ్యక్షుడు  చింతలపేరయ్య, స్థానిక నేతలు గుర్రం రంగావు, పొందూరి వీరాంజనేయులు, సారెద్దు శివరామరాజు, జూపల్లి లింగయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బిరుదు వెంకటేశ్వర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటమి భయంతోనే నాయకులకు ప్యాకేజీతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లఘింస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక నేతలు వివరించారు. ఈ విషయమై ఎమ్మెల్యే, ఎన్నికల కోడ్‌ అధికారులపై జిల్లా స్థాయి అధికారులకు, ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు