రైలుకు..రెడ్‌ సిగ్నల్‌

23 Mar, 2019 10:20 IST|Sakshi

గుర్తుందా సారూ..!

సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి.

2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం
కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు.

మార్గం సుగమం
కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్‌ఘడ్‌ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది.  చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఏళ్లుగా ఎదురుచూపులు 
రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు.  ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్‌ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి.  రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం.

మరిన్ని వార్తలు